ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌చార్జి, అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్‌లో శనివా రం పంచాయతీరాజ్, విద్యాశాఖ, గ్రంథాలయ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలకు వచ్చే పాఠకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, పాఠకులకు కుర్చీలు, టేబుళ్లు, టాయిలెట్లు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా చల్లని తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, ఆలయాల చరిత్రకు సంబంధించిన గ్రంథాలయ సర్వస్వం, ఈ విజ్ఞాన సూచిక, ఎంప్లాయిమెంట్ న్యూస్, కురుక్షేత్ర యోజన, కస్టమర్ ఆవాజ్, పునాది వంటి తెలుగు, ఇంగ్లిష్ మ్యాగజైన్లు ఉండాలన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సరిపడా మెటీరియల్స్ అందుబాటులో ఉంచాలన్నారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు గ్రంథాలయాల అభివృద్ధికి సెస్సు చెల్లించాలని సూచించారు. ఈ సందర్భంగా 2026– 27 ఆర్థిక సంవత్సరం వార్షిక పద్దును ఆమోదించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఏ.సరిత, డీపీవో భిక్షపతి, లైబ్రేరియన్లు సదానందం, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.


