జిల్లాలోని 1,052 ప్రభుత్వ పాఠశాలలకు నిధులు మంజూరు గ్రంథాలయాల్లో నూతన పుస్తకాల కొనుగోలుకు అవకాశం విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడమే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో పఠనాసక్తి, విద్యా సామర్థ్యాలు పెంపొందించేందుకు సర్కారు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. కరోనా ప్రభావం తర్వాత తగ్గిన పఠన స్థాయిని పెంచడమే లక్ష్యంగా గ్రంథాలయాలను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రంథాలయాలకు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఉపాధ్యాయులు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయనున్నారు.
కెరమెరి: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ధారాళంగా చదవడం, రాయడం రావాలనే ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలల్లో 3వ, 2వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఎఫ్‌ఎల్‌ఎస్(ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ) ద్వారా బోధన జరుగుతోంది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో విద్యాసామర్థ్యాల పెంపునకు ఇది ఎంతో దోహదపడుతోంది. 2వ తరగతి నుంచి ఆపై అన్ని తరగతుల విద్యార్థులకు ధారాళంగా చదవడం రావాలనే ఉద్దేశంతో గతంలో గ్రంథాలయ పుస్తకాలను సైతం అందించారు. వీటి నిర్వహణకు ఇటీవల ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేసింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలకు సైతం నిధులు అందనున్నాయి.
తగ్గిన పఠనస్థాయి
కరోనా ప్రభావం తర్వాత విద్యార్థుల్లో పఠన స్థాయి గణనీయంగా తగ్గింది. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనస్థాయి పెంపునకు ఎంతో కృషి చేస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సర్కారు పాఠశాలల్లో పఠనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. బడుల్లో ప్రత్యేక గ్రంథాలయాల ఏర్పాటుతోపాటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు నిత్యం గ్రంథాలయాల్లోని పుస్తకాలు, పత్రికలు చదవాలనే ఆదేశాలున్నాయి. లైబ్రరీలకు తాజాగా మరిన్ని పుస్తకా లు అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేశారు. అయితే విడుదలైన నిధులను ‘నేషనల్ బుక్ ట్రస్ట్’ పేరిట డీడీ కడితే వారే పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలను అందించే అవకాశం ఉంది.
రూ.17.63 లక్షలు మంజూరు
పుస్తకాలు కొనుగోలు చేసి చదివించాలనే ఉద్దేశంతో 2025– 26 విద్యా సంవత్సరానికి పాఠశాలలకే నేరుగా నిధులు విడుదల చేస్తూ ఎస్పీడీ నవీన్ నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల వారీగా వేర్వేరుగా నిధులను విడుదల చేశారు. జిల్లాలో 1052 ప్రభుత్వ పాఠశాలలకు రూ.17,63,456 నిధులు విడుదలయ్యాయి. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.1,171 చొప్పున, ఉన్నత పాఠశాలలకు రూ.5,198 కేటాయించనున్నారు. గతంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో కథలు, విజ్ఞానదాయక పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ప్రస్తుత నిధులతో విద్యార్థులకు ఆసక్తికరమైన పుస్తకాలు కొనుగోలు చేసి చదివించే అవకాశాన్ని ఉపాధ్యాయులకు కల్పించారు.


