నేత్రపర్వం.. పులకించిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం.. పులకించిన భక్తజనం

Mar 28 2026 7:48 AM | Updated on Mar 28 2026 7:48 AM

● అంగరంగ వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం ● రామనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు

మంగళసూత్రం చూపిస్తున్న అర్చకుడు

జన్కాపూర్‌లో హారతి ఇస్తున్న కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌: శ్రీరామనవమిని పురస్కరించుకుని జిల్లాలోని పట్టణాలు, పల్లెలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రంగురంగుల పుష్పాలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించిన వేదికలపై వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య శుక్రవారం సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తి వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగదభిరాముడి కల్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించి ఆశేష భక్తజనం పులకించింది. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ కోదండ రామాలయంలో అర్చకులు నిమ్మకంటి సంతోష్‌శర్మ, మహేశ్‌ శర్మ, ఒఝల శిరీష్‌శర్మ, ముదిగొండ రాజశేఖర శర్మ, నరేశ్‌ శర్మ, శ్రీధర్‌, తిరుపతి చారి, ఢిల్లీ విజయకుమార్‌ ఆధ్వర్యంలో పెళ్లి తంతు జరిపించారు. ముందుగా కేశవనాథ ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను హనుమాన్‌ దీక్షాస్వాములు బ్యాండ్‌ మేళా, మహిళల కోలాటాలు, భక్తిగీతాలతో గాంధీచౌక్‌, అంబేడ్కర్‌ చౌక్‌ మీదుగా జన్కాపూర్‌ రామాలయం వరకు శోభాయాత్రతో తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తనయుడు కోవ సాయినాథ్‌, హారిక దంపతులు, కేశవనాథ కమిటీ ఆధ్వర్యంలో వేర్వేరుగా పట్టువస్త్రాలు, మంగళసూత్రం, ముత్యాలు సమర్పించారు. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సుముహూర్తంలో అర్చకులు కల్యాణ ఘట్టం నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి కలెక్టర్‌ కె.హరిత, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఇరుకుల్ల మంగ, మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌, బీజేపీ సీనియర్‌ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, కార్తీక్‌, కొండు భారతి, కాంగ్రెస్‌ నాయకులు గాదెవేణి మల్లేశ్‌, బాలేశ్వర్‌గౌడ్‌, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. దీక్షాస్వాములు, భక్తులు ‘జై శ్రీరామ్‌’ నినాదాలతో హోరెత్తించారు. సాయంత్రం ఆలయంలో పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కమిటీ సభ్యులు డేగల సత్యనారాయణ, శివచందు, పర్రె యాదగిరి, సీహెచ్‌ రవి, భద్రయ్య, శైలేందర్‌, మహేశ్‌, మైనార్టీ నాయకులు జావిద్‌, కష్యప్‌ పాల్గొన్నారు. సీఐ బాలాజీ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement