కార్చిచ్చు.. ఆటకట్టు | - | Sakshi
Sakshi News home page

కార్చిచ్చు.. ఆటకట్టు

Mar 28 2026 7:48 AM | Updated on Mar 28 2026 7:48 AM

అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ చర్యలు శాటిలైట్‌ సమాచారంతో అప్రమత్తత ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు సమీప గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

పెంచికల్‌పేట్‌: వేసవి ముదురుతుండటంతో అడవుల్లో చెట్లు ఆకు రాల్చుతున్నాయి. గాలిలో తేమ తగ్గిపోయి పొడి వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఎండు ఆకులకు ఒక్క నిప్పురవ్వ తాకినా కాలిబూడిదగా మారుతాయి. చెట్లు, జీవరాశులకు తీవ్ర నష్టం చేకూరుస్తాయి. దీంతో అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ ముందస్తుగా సంసిద్ధమైంది. కార్చిచ్చులను గుర్తించేందుకు శాటిలైట్‌ సమాచారాన్ని వినియోగించుకుంటోంది. అలాగే ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతోపాటు కార్చిచ్చులు ఏర్పడిన సమయంలో స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చేలా అవగాహన కల్పిస్తున్నారు.

అడవుల రక్షణకు ఫైర్‌లైన్స్‌

జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్లలో 11 రేంజ్‌లు, 79 సెక్షన్‌లు, 245 బీట్లు, 846 కంపార్టుమెంట్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 6,04,172 ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. మారుమూల గిరిజన గ్రామాలు అటవీ ప్రాంతాల అతి దగ్గరగా ఉన్నాయి. నిత్యం పశువుల కాపరులు, వంట చెరుకు కోసం రైతులు అడవులకు వెళ్తుంటారు. ఎండిపోయిన ఆకులతో ప్రమాదవశాత్తు, మానవ తప్పిదాలతో కార్చిచ్చు రగిలి ఏటా వేలాది ఎకరాల్లో అటవీ సంపదకు నష్టం వాటిల్లుతోంది. మానవ తప్పిదాలతోనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంటల ఉధృతిని తగ్గించడం, అడవుల రక్షణకు ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. శాటిలైట్‌ సమాచారంతో అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాలను అరికడుతున్నారు. శాటిలైట్‌ ద్వారా వచ్చే సమాచారంతో తక్కువ సమయంలో ఘటన స్థలాలకు చేరుకునేందుకు వీలవుతుంది. అధికారులు భారీ నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నారు.

ప్రజలకు అవగాహన

జిల్లాలోని అడవుల్లో అత్యంత విలువైన వృక్ష, జంతు సంపద ఉంది. పెద్దవాగు, ప్రాణహిత, పెన్‌గంగ నదులు నిత్యం నీటితో ప్రవహిస్తుండటంతో అరుదైన వన్యప్రాణులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. కాగజ్‌నగర్‌ డివిజన్‌లో పెద్దపులులు, ఇతర వన్యప్రాణాలు, పక్షులు సంచరిస్తున్నాయి. అడవుల్లో కార్చిచ్చులు చెలరేగితే వీటికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ డివిజన్లలోని గ్రామాల్లో అధికారులు అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కల్పిస్తున్నారు. తునికాకు, ఇప్పపువ్వు సేకరణకు అడవులకు నిప్పు పెట్టే అవకాశం ఉండటంతో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు

అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. పశువుల కాపర్లు, అడవులకు వెళ్లే వారికి అవగాహన కల్పిస్తున్నాం. కార్చిచ్చుల సమయంలో మంటలు అడవుల్లోకి వ్యాపించకుండా ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేశాం. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలి.

– అనిల్‌కుమార్‌, ఎఫ్‌ఆర్‌వో, పెంచికల్‌పేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement