ఆసిఫాబాద్: మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని రైస్ మిల్లర్లలో సీఎంఆర్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ అనంతరం మిల్లింగ్‌లో ఎలాంటి ఆలస్యం జరగొద్దన్నారు. రవాణా, నిల్వ, మిల్లింగ్ అంశాలపై సమగ్రంగా చర్చించారు. రైస్ మిల్లర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎస్‌వో వసంత లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
మార్చిలోగా పనులు పూర్తిచేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మంజూరైన పనులు మార్చిలోగా పూర్తిచేయాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 1,084 ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల నిర్మాణాలు ఈ నెల 31 లోపు పూర్తి చేయాలన్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, ఏపీవోలు పాల్గొన్నారు.


