హోటళ్లకు గ్యాస్‌ సెగ | - | Sakshi
Sakshi News home page

హోటళ్లకు గ్యాస్‌ సెగ

Mar 18 2026 7:45 AM | Updated on Mar 18 2026 7:45 AM

● కమర్షియల్‌ సిలిండర్ల కొరతతో కట్టెల పొయ్యే దిక్కు ● పలు ప్రాంతాల్లో ఇప్పటికే మూత

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఎక్కడో పశ్చిమాసియాలో అలుముకున్న యుద్ధ మేఘాలు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల హోటళ్లలో పొయ్యిలు ఆరిపోయేలా చేస్తున్నాయి. గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అడ్డంకులు నిర్వాహకులకు కొత్త ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మరోవైపు వంటింట్లో ఉండాల్సిన డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లు అక్కడక్కడా వాణిజ్య సముదాయాల్లో దర్శనమిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నా అక్రమ వినియోగం ఆగడం లేదు. అధికారుల తనిఖీల్లో మంగళవారం దహెగాం, వాంకిడి, కెరమెరిలో వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న రాయితీ సిలిండర్లు పట్టుబడ్డాయి.

జిల్లా కేంద్రంలో నిర్వాహకులకు కష్టాలు

ఆసిఫాబాద్‌ పట్టణంలో దాదాపు 30కి పైగా హోట ళ్లు, టిఫిన్‌ సెంటర్లు ఉన్నాయి. గ్యాస్‌ కొరతతో హో టళ్లు నడపడం చాలా కష్టంగా ఉందని యజమానులు చెబుతున్నారు. సిలిండర్ల సరఫరా లేకపోవడంతో సోమవారం నుంచి జిల్లా కేంద్రంలోని ఓ హోట ల్‌ను మూసివేశారు. మరికొన్ని హోటళ్ల యజమానులు గత్యంతరం లేక కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్నారు. కొన్ని ప్రధాన హోటళ్లలో మాత్రం ప్రస్తుతం ఉన్న 2, 3 సిలిండర్లతోనే కాలం వెల్లదీస్తున్నారు. అవి కూడా అయిపోతే తాము కూడా వంటలు నిలిపివేస్తామని చెబుతున్నారు. కమర్షియల్‌ సిలిండర్లను వాణిజ్య సముదాయాలకు సకాలంలో అందేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని హోటల్‌ యాజమాన్యాలు కోరుతున్నాయి.

నో గ్యాస్‌..!

కౌటాల: మండల కేంద్రంతో పాటు ముత్తంపేట, గురుడుపేట గ్రామాల్లో హోటళ్లు, టీ స్టాల్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఉన్నాయి. గ్యాస్‌ కొరత నేపథ్యంలో హోటల్‌ నిర్వాహకులకు వారం రోజుల ముందే గ్యాస్‌ ఏజెన్సీలు సిలిండర్ల సరఫరా నిలిపివేశాయి. కమర్షియల్‌ గ్యాస్‌ కొరత ఉండటంతో నిర్వాహకులు రెండు మూడు రోజుల పాటు హోటళ్లను నడిపి, ఆపై బంద్‌ పెట్టే దిశగా ఆలోచిస్తున్నారు. కొందరు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు.

సిలిండర్ల కొరతతో ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. కిరాయిలు చెల్లించాలంటే అదనంగా ఆర్థిక భారం పడుతుంది. ప్రస్తుతం మా వద్ద ఉన్న మూడు సిలిండర్లను వాడుతున్నాం. అవి కూడా అయిపోతే హోటల్‌ తెరవలేని పరిస్థితి. కట్టెల పొయ్యితో తినుబండారాలను తయారు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుతం హోటల్‌లో ఒక కట్టెల పొయ్యిని వినియోగిస్తున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లను మూసివేయడంతో పాటు, తెరిచి ఉన్న హోటళ్లలో ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

– ఇరుకుల సంతోష్‌, హోటల్‌ యజమాని

కమర్షియల్‌ సిలిండర్ల కొరతతో ప్రస్తుతం హోటళ్లు నిర్వహించడం చాలా కష్టంగా మారింది. కట్టెలు కొనుగోలు చేసి హోటల్‌ను నడిపితే అదనపు భారం పడుతుంది. వంటచెరుకు కూడా అందుబాటులో లేదు. ప్రస్తుతం ఉన్న సిలిండర్లతో 3, 4 రోజులు హోటల్‌ను కొనసాగించవచ్చు. గత్యంతరం లేక కట్టెల పొయ్యిని వినియోగిస్తున్నాం. అధికారులు హోటళ్ల నిర్వహణకు సిలిండర్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

– కవాల్కర్‌ బాబురావ్‌, హోటల్‌ యజమాని

రాయితీ సిలిండర్లు పట్టివేత

దహెగాం: మండల కేంద్రంలోని హోటళ్లలో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌ దాడులు నిర్వహించారు. అక్రమంగా వినియోగిస్తున్న డొమెస్టిక్‌ సిలిండర్లను సీజ్‌ చేశారు. అక్రమంగా రీఫిల్లింగ్‌ చేయడం, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్లను నిల్వ చేసినా చర్యలు తప్పవన్నారు. మండల కేంద్రంలో వైన్స్‌ పర్మిట్‌ రూంలో రెండు సిలిండర్లు, జేఎస్‌కే ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఒక సిలిండర్‌ను స్వాధీనం చేసుకుని గ్యాస్‌ గోదాంలో అప్పగించామని తెలిపారు.

కెరమెరిలో హోటల్‌ యజమానులపై కేసు

కెరమెరి: గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లను వ్యాపారానికి వాడుతున్న నలుగురు హోటల్‌ యజమానులపై మంగళవారం కేసు నమోదు చేశామని ఎస్సై ఎన్‌.మధుకర్‌ తెలిపారు. మిస్బదాబా యజమాని రాథోడ విక్రమ్‌, ఆదిత్య దాబా యజమాని రాతోడ్‌ సుదర్శన్‌, పద్మ టిఫిన్‌ సెంటర్‌ యజమాని ముజాంబిల్‌ సైద్‌, ఆగ్రా స్వీట్‌హౌస్‌ యజామాని సనే చునిలాల్‌ డొమెస్టిక్‌ సిలిండర్లు వాడినట్లు తెలిపారు.

వాంకిడి మండలంలో ఇద్దరిపై..

వాంకిడి: గృహ అవసరాల గ్యాస్‌ సిలిండర్లను వ్యాపార నిమిత్తం వినియోగిస్తున్న ఇద్దరు హోటళ్ల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు. మండలంలోని గోయెగాం సమీపంలో గల దాబా, ఇందాని ఎక్స్‌రోడ్‌ సమీపంలోని ఏకే ఫుడ్‌కోర్ట్‌లో తనిఖీలు నిర్వహించగా.. డొమెస్టిక్‌ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇద్దరు యజమానులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటల్‌ తెరవలేకపోతున్నాం. అయినా వర్కర్లకు మాత్రం వేతనాలు చెల్లించా లి. అలాగే అద్దె, ఇతర బిల్లులు చెల్లింపులతో తమపై ఆర్థిక భారం పడుతోంది. అసలే ఎండాకాలం కావడంతో కట్టెల పొయ్యిని వినియోగించాలంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

– జె.శంకర్‌, హోటల్‌ యజమాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement