ఆసిఫాబాద్: కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశవర్కర్లు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన హామీల్లో భాగంగా ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశంలో ఆశవర్కర్ల సమస్యలపై తీర్మానం చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి వెలిశాల క్రిష్ణమాచారి, కొత్తపల్లి స్వరూప, పద్మ, సుకన్య, సక్రుబాయి, భాగ్య, పద్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.


