రైతులకు తీపి కబురు | - | Sakshi
Sakshi News home page

రైతులకు తీపి కబురు

Mar 18 2026 7:45 AM | Updated on Mar 18 2026 7:45 AM

ఈ నెల 22 నుంచి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ విడతల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రకటన హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

మొత్తం(రూ.లలో)

రెబ్బెన: పంట సాగులో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరో సా పెట్టుబడి సాయంపై ఏర్పడిన అనిశ్చితి తొలగిపోయింది. ఎట్టకేలకు ప్రభుత్వం నిధుల విడుదలపై స్పష్టతనిస్తూ రైతులకు తీపి కబురు అందించింది. యాసంగి సీజన్‌ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం అందా ల్సి ఉండగా ఎన్నికల కోడ్‌, ఇతర కారణాలతో పెండింగ్‌లో ఉంది. గతేడాది యాసంగి మాదిరిగా పెట్టుబడి సాయానికి దూరం కావాల్సి వస్తుందని ఆందోళన చెందారు. మున్సిపల్‌ ఎన్నికల ముగియగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చినా స్పష్టమైన తేదీ ప్రకటించలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ నెల 22 నుంచి విడతలవారీగా నిధుల విడుదల చేస్తామని ప్రకటించడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

విడతల వారీగా విడుదల

ఎకరానికి రూ.12వేల చొప్పున సంవత్సరానికి రెండు దఫాల్లో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. వానాకాలంలో నిధులు విడుదల చేసినా.. యాసంగి సీజన్‌కు సంబంధించి జాప్యం జరిగింది. యాసంగి పంటలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రారంభంలో నిధులు అందించి ఉంటే విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులకు ఉపయోగపడేది. నిధుల విడుదల జాప్యంతో ఖర్చుల కోసం ప్రైవేటు వ్యక్తులు, ఇతర ఆర్థిక మూలాలపై ఆధారపడ్డారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతుభరోసా అందించనున్నట్లు ప్రకటించింది. మూడు విడతల్లో అందించాలని నిర్ణయించింది. మొదటి విడతలో ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, 20 రోజుల అనంతరం రెండో విడత, ఇక ఏప్రిల్‌ నెలాఖరు నాటికి మిగిలిన రైతులందరికీ ఎకరానికి రూ.6వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కొత్త వారికి సైతం అవకాశం

2025– 26 సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించి కొత్తగా పట్టాపాస్‌ పుస్తకం పొందిన రైతులకు సైతం రైతుభరోసా సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యవసాయానికి యోగ్యత కలిగిన భూములను గుర్తించిన వ్యవసాయశాఖ అధికారులు రైతుభరోసా పథకానికి అర్హులను తేల్చారు. గత వానాకాలంలో జిల్లాలో 1,43,063 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.2,66,86,59,662 అందించారు. తాజాగా ప్రభుత్వం కొత్తగా పట్టాపాస్‌ పుస్తకాలు పొందిన రైతులకు అవకాశం కల్పించడంతో యాసంగి పెట్టుబడి సాయం పొందే లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 28లోగా కొత్త పట్టాపాస్‌ పుస్తకం, డిజిటల్‌ సంతకం అయిన రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. గతంలోనే పట్టాపాస్‌ పొంది ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారికి కూడా అవకాశం కల్పించారు. పట్టాపాస్‌ పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, రైతుభరోసా దరఖాస్తు ఫారంతో కలిపి సంబంధిచి వ్యవసాయ విస్తరణ అధికారికి అందిస్తే సరిపోతుంది.

కొత్తవారు దరఖాస్తు చేసుకోవాలి

యాసంగి సీజన్‌ రైతు భరోసా పెట్టుబడిసాయం కోసం కొత్తగా పట్టాపాస్‌ పుస్తకం పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 28 నాటికి పట్టాపాస్‌ పుస్తకం కలిగి ఉన్నవారు, డిజిటల్‌ సంతకమైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలోనే పట్టాపాస్‌ పుస్తకం పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవాలి. పెట్టుబడి సాయం విడుదలపై అధికారికంగా ఎలాంటి ఉత్వర్వులు అందలేదు. ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తుంది.

– వెంకట్‌, జిల్లా వ్యవసాయాధికారి

మండలాల వారీగా అర్హుల వివరాలు

మండలం గ్రామాలు రైతులు గతంలో జమచేసిన

ఆసిఫాబాద్‌ 71 13,496 24,65,11,780

జైనూర్‌ 34 7,429 18,41,12,249

కెరమెరి 68 8,405 18,32,79,303

లింగాపూర్‌ 17 5,876 14,34,90,420

రెబ్బెన 35 13,300 22,44,08,136

సిర్పూర్‌(యు) 22 6,138 15,51,52,215

తిర్యాణి 47 8,501 16,79,13,543

వాంకిడి 49 10,880 23,56,93,793

బెజ్జూర్‌ 34 10,824 17,04,33,482

చింతలమానెపల్లి 27 8,910 15,20,14,555

దహెగాం 37 13,224 21,26,54,177

కాగజ్‌నగర్‌ 41 14,069 23,32,36,566

కౌటాల 21 7,802 13,16,11,013

పెంచికల్‌పేట్‌ 25 6,459 9,68,62,889

సిర్పూర్‌(టి) 32 7,750 13,12,85,541

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement