రెబ్బెన: సింగరేణి కార్మికుల పెండింగ్ డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. 2025 జూలై నుంచి ఇప్పటివరకు జరిగిన మెడికల్ బోర్డులను సమీక్షించి అర్హులను అన్‌ఫిట్ చేసి, కారుణ్య నియామకాలు చేపట్టాలని, సొంతింటి పథకం అమలుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని, మాస్టర్ సర్క్యులర్ పేరుతో పెట్టిన నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈఅండ్‌ఎం సూపర్‌వైజర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పారామెడికల్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అనంతరం ఓసీపీ మేనేజర్ శంకర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. కార్యక్రమాల్లో జీఎం కమిటీ సభ్యుడు రాజేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్‌బాబు, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి ఓదెలు, షిఫ్ట్ ఇన్‌చార్జి అంజమయ్య, నాయకులు రాజ్‌కుమార్, సత్యనారాయణ, నరేశ్, తిరుపతి, నర్సింగం, తిరుపతి, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ధర్నా చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు


