నందిగామ పాలరాపు గుట్ట నుంచి మకాం మార్పు గూళ్లు కూలిపోవడంతో కమలాపూర్‌కు వెళ్లిన వైనం అటకెక్కిన ‘జటాయువు’ ప్రాజెక్టు ప్రతిపాదనలు నిధుల కేటాయింపులో జిల్లా అటవీశాఖ నిర్లక్ష్యం
పెంచికల్‌పేట్: పాలరాపు గుట్టను ఆవాసంగా మార్చుకున్న అరుదైన లాంగ్ బిల్డ్ వల్చర్స్(పొడుగు ముక్కు రాబందులు) క్రమంగా కనుమరుగవుతున్నాయి. పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఈ అరుదైన రాబందులను అటవీశాఖ అధికారులు 2013 సంవత్సరంలో పెంచికల్‌పేట్ మండలంలోని నందిగామ వద్ద, పెద్దవాగు– ప్రాణహిత సంగమం ప్రాంతంలో గుర్తించారు. సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో వాటి సంతతి క్రమేణా పెరిగింది. అయితే కొన్నేళ్లుగా రాబందుల సంరక్షణకు నిధుల కేటాయింపులో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పొరుగున ఉన్న మహారాష్ట్రలోని కమలాపూర్‌కు వలస వెళ్లాయి. అడపాదడపా పాలరాపు గుట్ట వద్ద సంచరిస్తూ పక్షి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. గతంలో అధికారులు నిర్వహించిన బర్డ్ వాక్ కార్యక్రమంలో పాలరాపు గుట్ట వద్ద హిమాలయాల్లో నివసించే అరుదైన గ్రిఫ్ఫోన్ రాబందులను కూడా అధికారులు గుర్తించారు.
రక్షణ చర్యలు కరువు..
జిల్లాలో మొట్టమొదటిసారిగా అంతరించిపోతున్న దశలో ఉన్న రాబందులను అటవీశాఖ అధికారులు పాలరాపు గుట్ట వద్ద గుర్తించారు. 200 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టపై సహజంగా ఉన్న గూళ్లలో సుమా రు 24 రాబందులను అధికారులు కనుగొన్నారు. వాటి గమనాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా బయాలజిస్ట్‌ను నియమించడంతో పాటు రాబందులకు ఎలాంటి హాని తలపెట్టకుండా నిధులను కేటాయించి బర్డ్ వాచర్స్‌ను నియమించారు. వాటి జీవన విధానాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి వాచ్ టవర్ సైతం ఏర్పాటు చేశారు. రాబందుల కోసం ప్రత్యేకంగా ‘రాబందుల రెస్టారెంట్’ ఏర్పాటు చేసి కృత్రిమంగా ఆహారం అందజేయడంతో పదేళ్లలో వాటి సంతతి గణనీయంగా పెరిగి 36కు చేరుకుంది. దీంతో రాష్ట్రంలోనే అరుదైన జాతులకు నిలయంగా పాలరాపు గుట్ట నిలిచింది.
లోపించిన పర్యవేక్షణ
అటవీశాఖ ఆధ్వర్యంలో సంరక్షణ కేంద్రంగా ఉన్న పాలరాపు గుట్ట వద్ద క్రమక్రమేణా పర్యవేక్షణ లోపించింది. నిధుల లేమితో బయాలజిస్ట్‌తో పాటు బర్డ్ వాచర్లను కూడా తొలగించారు. మరో వైపు భారీ వర్షాలకు ఎత్తైన ప్రాంతంలో ఉన్న గూళ్లు దెబ్బతినడంతో ఏటా రాబందులు ఆవాసాన్ని వది లి కొత్త ప్రాంతాలకు తరలిపోయాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో గల కమలాపూర్‌ను ప్రస్తుతం ఈ రాబందులు ఆవాసంగా మార్చుకున్నాయి. రక్షణ చర్యలు లేకపోవడంతో మూడు ఏళ్లుగా రాబందులు అప్పుడప్పుడు మాత్రమే దర్శనమిస్తున్నాయి. కమలాపూర్‌లో అటవీశాఖ అధికారులు పకడ్బందీగా సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు సిబ్బందిని నియమించి నిరంతరం ఆహారం అందిస్తున్నారు. దీంతో కమలాపూర్ ఇప్పుడు అరుదైన రాబందులకు ప్రధాన ఆవాసంగా మారింది.
నందిగామ వద్ద రాబందుల స్థావరం పాలరాపు గుట్ట
సంరక్షణకు ప్రతిపాదనలు పంపించాం
అరుదైన జాతికి ఆవాసంగా ఉన్న పాలరాపు గుట్ట వద్ద రాబందులు సంచరిస్తున్నాయి. గ తంలో అటవీశాఖ అధికారులు వాటిని గు ర్తించి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సంతతి అభివృద్ధి చెందింది. అకాల వర్షాలతో గూళ్లు కూలిపోవడంతో రాబందులు ఆవాసాన్ని మార్చుకున్నాయి. వాటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం.
– అనిల్ కుమార్, ఎఫ్‌ఆర్‌వో, పెంచికల్‌పేట్


