గ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమాయణం అప్పటికే అతడికి పైళ్లె పిల్లలు ఇటీవల గర్భం దాల్చిన యువతి.. పెళ్లికి ఒత్తిడి చేయడంతో కడతేర్చిన వైనం
పెంచికల్‌పేట్: పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం సాగించిన యువతి.. అతడి కారణంగా గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. భార్య, పిల్లలు ఉన్న వ్యక్తి యువతిని వదిలించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో ఆమెను కడతేర్చాడు. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి పంచాయతీ పరిధిలోని జైహింద్‌పూర్ అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపల్లి గ్రామానికి చెందిన ఆత్రం సమ్మక్క(25)తో జైహింద్‌పూర్ గ్రామానికి చెందిన వివాహితుడు కేర్కరి జలపతి ప్రేమ వ్యవహారం నడిపించాడు. అతడి కారణంగా సమ్మక్క గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో ఎలాగైనా సమ్మక్కను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు.
అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి..
ముందస్తు ప్లాన్ ప్రకారం.. శనివారం సమ్మక్కకు మాయమాటలు చెప్పి సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లాక.. తలపై బండరాయితో కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం అడవిలోకి వెళ్లినవారు మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై అనిల్‌కుమార్ ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ పరిశీలించారు. మృతురాలి సోదరి ఆత్రం మిరియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


