ఆసిఫాబాద్‌అర్బన్: బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ నితిక పంత్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలు విని చట్టప్రకారం పరిష్కరించాలని ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలు వినియోగించుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే చర్యలు
జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని, ఎవరైనా సిలిండర్లు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ హెచ్చరించారు. సిలిండర్ల కొరతపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని, జిల్లాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వినియోగదారులకు సకాలంలో సిలిండర్లను అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్రమ నిల్వలు జరుగకుండా, మధ్యవర్తులు అధిక ధరలకు విక్రయించకుండా ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు. డెలివరీ బాయ్స్ అధిక ధరలకు విక్రయిస్తే తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు.


