సిర్పూర్(టి): జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు నెలల తరబడి వేతనాలు అందడం లేదు. సకాలంలో డబ్బులు రాక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కూలీలకు ప్రతినెలా ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాల్సి ఉండగా, జనవరి నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. త్వరలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, జిల్లావ్యాప్తంగా పనులు జోరుగా సాగుతున్నాయి. లక్ష్య సాధన దిశగా అధికారులు పనులు చేపడుతున్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని తెలుస్తోంది.
2.50 లక్షల మంది కూలీలు
జిల్లాలో మొత్తం 1.50లక్షల జాబ్ కార్డులు ఉండగా, ఇందులో 2.50 లక్షల మంది కూలీలు ఉన్నారు. జనవరి 12 నుంచి ఇప్పటివరకు వేతనాలు రాలేదు. ఒక్క సిర్పూర్(టి) మండలంలోనే రూ.50 లక్షల వరకు పెండింగ్ ఉండగా, జిల్లాలో మొత్తంలో సు మారుగా రూ.11 కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉంద ని ఆ శాఖ అధికారులు తెలిపారు. జనవరి నుంచి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతోనే డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటున్నారు. త్వరలో నే చెల్లించే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.
త్వరలోనే చెల్లింపులు
ఉపాధిహామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న కూలి డబ్బులు త్వరలోనే మంజూరవుతాయి. నగదు విడుదల కోసం ఉన్నతాధికారుల ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని కూలీలు ఎలాంటి ఆందోళన చెందొద్దు.
– చంద్రయ్య, ఏపీవో, సిర్పూర్(టి)


