ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం అంకితభావంతో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ప్రత్యేక వైద్యశిబిరానికి డీఎంహెచ్‌వో సీతారాం, కౌన్సిలర్ చిలువేరు వెంకన్నతో కలిసి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామయ్య, నాయకులు సాయిశ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


