ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పోలీసు, రెవెన్యూ, ఎస్సీ సంక్షేమ, శిశు సంక్షేమ, డీవీఎంసీ సభ్యులతో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బాధిత కుటుంబాలకు వేగంగా న్యాయం జరగాలన్నారు. 2025లో 31 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, 2026లో ఇప్పటివరకు ఆసిఫాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 3, కాగజ్‌నగర్ సబ్ డివిజన్ పరిధిలో 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆయా కేసులు త్వరగా విచారించి నిందితులకు చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతినెలా 30న ప్రతీ మండలంలో పౌర హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ అధికారి అశోక్, డీఆర్‌డీవో దత్తారావు, సీఐ బాలాజీ వరప్రసాద్, డీవీఎంసీ సభ్యులు కేశవ్‌రావు, సిడాం అర్జు, గుంగుబాయి, అశోక్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
సదరం శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని దివ్యాంగులు సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న శిబిరాన్ని బుధవారం డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు తాగునీరు, చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఎం పెన్షన్ విభాగం రామకృష్ణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


