రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా బొగ్గు ఉత్పత్తిలో శరవేగంగా ముందుకు సాగుతోంది. గడిచిన రెండు సంవత్సరాలుగా వందశాతం వార్షిక ఉత్పత్తి సాధించగా.. ఈసారి సైతం నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందు కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అధిక వర్షాలు, పావురాల గుట్ట వద్ద రోడ్డు దెబ్బతిని బొగ్గు ర వాణా ఆటంకాలు, అనేక సవాళ్లు ఎదురైనా అధి కారులు ముందస్తు ప్రణాళికలతో ఏరియాను ఉత్పత్తిలో ముందంజలో నిలిపారు. ఫిబ్రవరి నాటికి 99 శాతం సాధించారు. ప్రారంభ రెండు నెలల్లో నిరాశపూరిత ఉత్పత్తి కనిపించింది. ఆ వెంటనే వర్షాకాల సీజన్ ప్రారంభం కావడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో నెలలో 20 రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. అయినా అధికారులు, ఉద్యోగులు మొక్కవోని దీక్ష ఉత్పత్తిని పరుగులు పెట్టించారు.
ముందస్తు ప్రణాళికలతో..
ఈ ఏడాది బెల్లంపల్లి ఏరియాను అధిక వర్షాలు అతలాకుతలం చేశాయి. గతేడాది వర్షాకాలంలో కేవలం 1200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈసారి ఏకంగా 2099 మి.మీ.లుగా నమోదైంది. వర్షాల ప్రభావం ఏరియాలోని ఏకై క ఓసీపీ ఖైరిగూరపై పడింది. ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి కురిసిన వర్షాలతో ఆగస్టు, సెప్టెంబర్‌లో కేవలం ఒక నెల టార్గెట్ చేరుకున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే బొగ్గు ఉత్పత్తిని చేపట్టేందుకు ఏరియా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా పంపులను సిద్ధం చేసుకున్నారు. అదనపు మోటార్లు, హైకెపాసిటీ మోటార్లను ఏర్పాటు చేసి ఓసీపీ క్వారీ లోపలికి వచ్చే వరదనీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడారు. దీంతో వర్షాకాలంలోనూ కొంతమేర ఉత్పత్తి సాధ్యమైంది. అక్టోబర్ నుంచి మరింత వేగం పెంచారు. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ పూర్తిగా ఓబీ మట్టి వెలికితీత పనులపై ఆధారపడి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ముందస్తుగా కోల్‌బెంచ్‌లు సిద్ధంగా ఉండాలి. కోల్‌బెంచ్‌లపై ఉన్న ఓబీని వెలికితీసే బాధ్యత కాంట్రాక్టర్‌పై ఉంటుంది. అయితే స్థానిక ఓబీ కాంట్రాక్టర్ సైతం బెల్లంపల్లి ఏరియా అధికారులకు పూర్తి సహకరించి పనులు చేపట్టారు. రోజువారీ ఓబీ ఉత్పత్తిని వందశాతానికి మించి వెలికితీయడంతో అక్టోబర్ నుంచి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి ఉరకలు వేసింది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతినెలా నెలవారీ ఉత్పత్తి టార్గెట్‌ను వందశాతానికి మించి చేపట్టింది.
లక్ష్య సాధన వైపు అడుగులు
బెల్లంపల్లి ఏరియా ఒకప్పుడు భూగర్భ గనులు, ఓసీపీలతో కళకళలాడింది. కాలక్రమేణా భూగర్భ గనులు, ఓసీపీలు మూసివేతకు గురికాగా ఖైరిగూర ఓసీపీ ఒక్కటే జీవనాడిగా మారింది. గోలేటి ఓసీపీ కోసం ఏరియా అధికారులు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితం లేకుండా పోయింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి గోలేటి ఓసీపీలో ఉ త్పత్తి ప్రారంభమవుతుందని, ప్రస్తుత ఓసీపీకి అతి తక్కువ టార్గెట్ కూడా విధించారు. అయితే ఓసీపీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు రాకపోవడంతో ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. గతేడాది ఏరియా వార్షిక ఉత్పత్తిలో 97 అని రికా ర్డుకు చూపిస్తున్నా గోలేటి ఓసీపీ ఉత్పత్తి టార్గెట్‌ను మినహాయిస్తే ఏరియా వందశాతం సాధించింది. 2023– 24 ఆర్థిక సంవత్సరంలోనూ ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఫిబ్రవరి వరకు ఏరియా 99 శాతం వార్షిక ఉత్పత్తిని సాధించగా.. మార్చి నెలాఖరులోపే వందశాతం సాధించనుంది. ఈ ఆ ర్థిక సంవత్సరంలో ఏరియాకు 31.5లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఫిబ్రవరి నెల వరకు 31.06 టన్నులతో 99 శాతం ఉత్పత్తి పూర్తయ్యింది. వార్షిక లక్ష్య సాధనకు కేవలం 43,982 టన్నులు మాత్రమే సాధిస్తే సరిపోతుంది. దానికి ఏరియాకు దాదాపు 20 రోజుల సమయం ఉంది. ప్రస్తుతం రోజుకు దాదాపు 10 నుంచి 12 వేల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. దీంతో వరుసగా మూడో సంవత్సరం సైతం ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించనుంది. చిన్న ఏరియా అయినా ఇక్కడి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ ఏరియా ఉత్పత్తిలో దూసుకుపోతూ సింగరేణి సంస్థకు లాభాలను తెచ్చిపెడుతోంది.
గడువుకు ముందే సాధిస్తాం
బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే ముందు సాధించబోతున్నాం. ఈసారి అధిక వర్షపాతం నమోదైనా ముందస్తు ప్రణాళికలను అమలు చేయడంతో వార్షిక టార్గెట్‌ను వందశాతం సాధించనున్నాం. పావురాల గుట్ట వద్ద రోడ్డు దెబ్బతిని 25 రోజులపాటు రవాణా నిలిచిపోయినా ఆ ప్రభావం టార్గెట్‌పై పడకుండా చూసుకున్నాం.
– విజయ భాస్కర్‌రెడ్డి, బెల్లంపల్లి ఏరియా జీఎం


