వాంకిడి: కుష్ఠు లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ఖమాన, ఖిరిడి గ్రామాల్లో కుష్ఠు, బోదకాలు వ్యాధులపై కళాజాత నిర్వహించా రు. ఆటపాటలతో ప్రజలకు అవగాహన క ల్పించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ శరీరంపై రాగి రంగు స్పర్శ లేని మచ్చలు ఉంటే ఆస్పత్రిలో చూపించుకుని వైద్యుడి సలహాలు తీసుకోవాలన్నారు. కుష్ఠు లక్షణాలు ఉన్న వారు నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యానికి దారి తీస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యాధికి ఉచితంగా మందులు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత, ఎన్‌ఎల్‌ఈపీ ఆఫీసర్ వినయ్ ఉప్రె, డీఈఎంవో మార్తా, డీఎస్‌వో రమేశ్ చంద్ర, సమన్వయకర్త శ్యాంలాల్, ఆరోగ్య విస్తరణ అధికారి రవిదాస్ తదితరులు పాల్గొన్నారు.


