గత నెలలో ఖర్జెల్లి రేంజ్‌లోని అంబగట్ట గ్రామంలో నిల్వ ఉంచిన కర్రను డిప్యూటీ రేంజ్ అధికారి, ఆమె భర్త అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో కేసు నమోదైంది. అనంతరం విచారణ చేపట్టారు.
తాజాగా ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని కోయపల్లి సమీపంలో పంగోలిన్ అనే అరుదైన రెండు వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తూ బెజ్జూర్ రేంజ్ అటవీ అధికారులకు పట్టుబడ్డారు. ఖర్జెల్లి రేంజ్‌లో ఈ ఘటనపై కేసు నమోదు కాగా ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
చింతలమానెపల్లి: తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు సరిహద్దులోని ప్రాణహిత నదిని ఆనుకుని ఉన్న జిల్లా కీలకమైన ఖర్జెల్లి అటవీ రేంజ్ అక్రమాలకు నిలయంగా మారుతోంది. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి విలువైన కలప తరలిపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యాయి. మరోవైపు సంరక్షకులుగా నిలవాల్సిన అధికారులపై ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్ మండలాల్లో విస్తరించి ఉన్న ఖర్జెల్లి రేంజ్ పరిధిలో 6 సెక్షన్లు, 18 బీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 18 బీట్లకు ఐదుగురు బీట్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. చింతలమానెపల్లి మండలంలోని సుమారు 20కిలోమీటర్ల అంతర్రాష్ట్ర రహదారి ఈ అటవీ ప్రాంతంలోనే ఉంది.
విస్తారమైన టేకు చెట్లు
ఖర్జెల్లి రేంజ్ అటవీ పరిధిలో భారీస్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ టేకు చెట్లు విస్తారంగా ఉన్నాయి. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి కలప అక్రమంగా రవాణా చేస్తున్నారు. కాటేపల్లి, గూడెం, దిందా గ్రామాలను కేంద్రంగా చేసుకుని గతంలో భారీ ఎత్తున కలప తరలిపోయింది. కానీ నమోదైన కేసులు మాత్రం నామమాత్రమే. ఇటీవల నమోదైన రెండు ఘటనల్లో రేంజ్ అధికారుల వైఫల్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అంబగట్ట ఘటనలో టేకు దుంగలను స్థానికులు పట్టుకోగా.. పంగోలిన్ వన్యప్రాణిని బెజ్జూర్ అటవీ రేంజ్ సిబ్బంది పట్టుకోవడం గమనార్హం.
అధికారులపైనే ఆరోపణలు..!
ఖర్జెల్లి రేంజ్‌లో విధుల్లో ఉండే అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అ డవుల అభివృద్ధికి పదుల సంఖ్యలో ఉద్యోగులు వి ధుల్లో ఉన్నా.. రూ.కోట్లు వెచ్చిస్తున్నా తీరుమారడం లేదు. గతంలో ఇక్కడ పని చేసిన ఒక డిప్యూటీ రేంజ్ అధికారి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జిల్లాస్థాయిలో విచారణ నిర్వహించా రు. సదరు అధికారి ఒక ప్రాంతంలో కలపను నిల్వ ఉంచి తరలించినట్లు ఆరోపణలు వచ్చినా విచారణ మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. ఒక నర్సరీలో చేపట్టిన మొక్కల పెంపకంలో సదరు అధికారి తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గోప్యంగా వివరాలు సేకరించారు. అధికారి బదిలీతో అన్నీ మరుగున పడ్డాయి. కబ్జాదారుల నుంచి మామూళ్లు తీసుకుని అటవీ భూముల ఆక్రమణకు సహకరించారని పలువురు అధికారులపైనా ఆరోపణలు వచ్చాయి. కాటెపల్లి, గూడెం, దిందా, గంగాపూర్, బూరెపల్లి బీట్లలో పనిచేసే అధికా రులపై పలుమార్లు విచారణలు జరిగాయి. అంబగట్ట గ్రామంలో నిల్వ ఉంచిన కర్రను తరలించేందు కు ప్రయత్నించిన డిప్యూటీ రేంజ్ అధికారిపై శా ఖాపరమైన చర్యలు సైతం తీసుకున్నారు. చెట్లు న ష్టపోయిన సందర్భాల్లో బీట్ అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకున్నారు. వారి వేతనాల నుంచి రికవరీ విధించారు.
స్మగ్లింగ్‌కు రహదారి
ఖర్జెల్లి రేంజ్ మహారాష్ట్రలోని ఆళ్లపల్లి డివిజన్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్లకు మధ్యలో ఉంది. గతంలో ఈ మార్గంలో అక్రమంగా భారీ స్థాయిలో కలపను తరలించగా మహారాష్ట్ర అధికారులు కాగజ్‌నగర్ డివిజన్‌లో పలు కేసులు నమోదు చేశారు. తాజాగా పంగోలిన్ అనే అరుదైన వ న్యప్రాణులను తరలిస్తుండగా అటవీ సిబ్బంది పట్టుకున్నారు. మహారాష్ట్రలోని అడవుల నుంచి కాగజ్‌నగర్ మీదుగా, బెజ్జూర్ మండలం మీదుగా వన్యప్రాణులు, కర్రను స్మగ్లింగ్ చేయడానికి స్మగ్లర్లు రేంజ్‌లోని మార్గాలను వినియోగించుకుంటున్నారు. రేంజ్‌కు ప్రాణ హిత నది సరిహద్దుగా ఉండగా ఈ మార్గంలో గూడెం వద్ద మాత్రమే వంతెన ఉంది.
పటిష్టంగా నిఘా
ఖర్జెల్లి రేంజ్‌లో స్మగ్లింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది నిర్లక్ష్యం ఉన్న సందర్భాల్లో రికవరీ చేపట్టడం సాధారణం. సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా యూనియన్ నాయకుడిగా అండగా ఉంటున్నా. అంబగట్ట ఘటనలో కేవలం రూ.47వేల విలువైన కర్రను మాత్రమే సదరు డీఆర్‌వో తరలించారు. దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదు. అంత పెద్ద అడవిలో ఇలాంటి చిన్న ఘటనలు జరగడం సాధారణం.
– సుభాష్, ఖర్జెల్లి రేంజ్ అటవీ అధికారి


