పది పరీక్షలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

పది పరీక్షలకు వేళాయె

Mar 10 2026 7:19 AM | Updated on Mar 10 2026 7:19 AM

● ఈ నెల 14 నుంచి ప్రారంభం ● సన్నద్ధమవుతున్న విద్యార్థులు ● ఉత్తీర్ణత పెంచేందుకు విద్యాశాఖ ప్రణాళికలు

దహెగాం: పదో తరగతి వార్షిక పరీక్షలకు కేవలం నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నెల 14 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతేడాది కంటే ఈసారి ఉత్తమ ఫలితాల సాధనకు ముందస్తు ప్రణాళికతో పాటుపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఏటా జనవరి నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభిస్తుండగా డీఈవో బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్‌ అధికారి అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి డిసెంబర్‌ నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన బదిలీ అయినా మార్చి 13 వరకు ప్రత్యేక తరగతులు కొనసాగనున్నాయి.

6,949 మంది విద్యార్థులు

జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో 175 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 6,949 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇన్విజిలేటర్లు, పరీక్షల నిర్వహణ అధికారుల నియామకం పూర్తయ్యింది. ఈ నెల 14 నుంచి ప్రారంభం ఏప్రిల్‌ 16 వరకు దాదాపు నెలరోజులపాటు కొనసాగనున్నా యి. ప్రభుత్వం నుంచి షెడ్యూల్‌ విడుదలైన సమయంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయినా ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. ఒక్కో పరీక్షకు మధ్య కనీసం రెండు నుంచి వారం రోజుల వ్యవధి ఉంది. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫలితాల శా తం కూడా పెరిగే అవకాశం ఉంది. 2024– 25 విద్యాసంవత్సరం పదో వార్షిక ఫలితాల్లో జిల్లాలో 87.3 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి ఉత్తీర్ణత పెంచడానికి కసరత్తు చేస్తున్నారు.

వీరికి దూరభారం..

జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు దురభారం తప్పేలా లేదు. దహెగాం మండల కేంద్రంలో పరీక్ష కేంద్రానికి ఇట్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు సుమారు 17 కిలోమీటర్ల ప్రయాణించాలి. అలాగే కుంచవెల్లి, చినరాస్పెల్లి, కల్వాడ, బీబ్రా పాఠశాలలు సెంటర్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆర్టీసీ సేవలు లేనందున విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిందే. కౌటాల మండల కేంద్రంలోని పదో తరగతి పరీక్ష కేంద్రం నుంచి గుండాయిపేట విద్యార్థులు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మిగతా హైస్కూళ్లు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చింతలమానెపల్లి కేంద్రానికి డబ్బా, గంగాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. పెంచికల్‌పేట్‌ పరీక్ష కేంద్రానికి చేడ్వాయి 10 కిలోమీటర్ల దూరంలో ఉండగా అక్కడి విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లో రానున్నారు. సిర్పూర్‌(టి) పరీక్షకేంద్రంలో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని లోనవెల్లి, వేంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. బెజ్జూర్‌ మండల కేంద్రంలో పరీక్ష కేంద్రానికి పాపన్‌పేట, సల్గుపల్లి, కుంటలమానెపల్లి పాఠశాలల విద్యార్థులు 7 నుంచి 10 కిలోమీటర్ల దూరం ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణించాలి.

మూడేళ్లుగా ఉత్తీర్ణత ఇలా..

వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు

పదో తరగతి విద్యార్థుల హాల్‌టికెట్లను పాఠశాలలకు ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. హాల్‌టికెట్లు సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇప్పటికే చాలామంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో ఉన్నత పాఠశాలలకు హాల్‌టికెట్లు చేరుతాయని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement