ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్ కె.హరిత అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. బాధితులు సంబంధిత అధికారులకు సమస్యలు చెప్పుకుని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వాంకిడి మండలం జైత్‌పూర్ గ్రామానికి చెందిన కోట సరిత దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించింది. రెబ్బెన మండలం వంకుటం గ్రామానికి చెందిన శంకరమ్మ తనకు ఉపాధి కల్పించాలని దరఖాస్తు చేసుకుంది. పత్తి పంట నష్టపోయిన తనకు పరిహారం అందించాలని ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ గ్రామానికి చెందిన యటకా రి మల్లేశ్ వేడుకున్నాడు. తాను సాగు చేస్తున్న ప్రభుత్వ భూమికి పట్టా ఇవ్వాలని సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెందిన మహాల్కర్ రవి కోరా డు. పెంచికల్‌పేట్ మండలం పోతెపల్లి గ్రామంలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని సర్పంచ్ దుర్గం పోషన్న దరఖాస్తు చేశాడు. వ్యవసాయ చేనులో కూలిపోయిన సాగునీటి బావికి మరమ్మతులు చేపట్టాలని జైనూర్ మండలం ఆశపల్లి గ్రామానికి చెందిన రాథోడ్ హరి అర్జీ చేసుకున్నాడు. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన కోలె బిక్కాజీ, పలువురు డాటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే వివరాలను ఆన్‌లైన్ చేసిన డబ్బులు చెల్లించాలని దరఖాస్తు చేసుకున్నారు. సిర్పూర్(టి) మండలం జైభీంనగర్‌కు చెందిన డోంగ్రె తులసీరాం తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న భూమికి పట్టా చేయించాలని విన్నవించాడు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


