వాంకిడి: కేజీబీవీ, యూఆర్‌ఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన మూడు దశల పోరాటాన్ని విజయవంతం చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు శృతిక పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ, కేజీబీవీలో సోమవారం భోజన విరామం సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. శృతిక మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. దీర్ఘకాలంగా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నా అరకొర వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. గత పోరాటాల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ బడ్జెట్ సమావేశాలో సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకోకుంటే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మండల కార్యదర్శి తిరుమల, సీఆర్పీల సంఘం మండల అధ్యక్షుడు విజయబాబు, సభ్యులు వెంకటేశ్, రైజా, లలిత, శ్రీలత, వెంకటలక్ష్మి, మమత, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


