ఆసిఫాబాద్‌అర్బన్: టీజీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను యాజమాన్యం శ్రమ దోపిడీకి గురిచేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మండిపడ్డారు. జిల్లా క ేంద్రంలోని ఎస్‌టీయూ భవన్‌లో ప్రైవేటు హైర్‌బస్ డ్రైవర్‌లతో డిపో అధ్యక్షుడు మధుసూదన్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఉపేందర్ మాట్లాడుతూ ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో ఆర్టీసీ అభివృద్ధికి ప్రైవేట్ హైర్‌బస్ డ్రైవర్లు కృషి చేస్తున్నారని తెలిపారు. అయినా కార్మిక చట్టాలు అమలు చేయకపోవడంతో శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనంగా రూ.26వేలు చెల్లిస్తూ ఈఎస్‌ఐ, పీఎఫ్, బోనస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. సమావేశంలో పీహెచ్‌బీ డ్రైవర్స్ సజిత్‌హుస్సేన్, అశోక్, సాయికిరణ్, రమేశ్, ప్రకాశ్ పాల్గొన్నారు.


