తిర్యాణి: ఉపాధి పనులు పారదర్శకంగా చేపట్టాల ని డీఆర్‌డీవో దత్తారావు అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. సభ్యులు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8.61కోట్లతో చేపట్టిన 519 పనులపై క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన వివరా లను సభలో చదివి వినిపించారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి రూ.95 వేల జరిమానా విధించారు. డీఆర్‌డీవో మాట్లాడుతూ పనుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. గడువులోగా జరిమానాలు చెల్లించాలని సూచించారు. మండలంలో చాలాచోట్ల ఒకే కుటుంబానికి రెండేసి జాబ్‌కార్డులు జారీ అయినట్లు తెలిసిందన్నారు. వెంటనే రెండు జాబ్‌కార్డులు ఉన్నచోట ఒకటి తొలగించాలని సిబ్బంది ఆదేశించారు. ఎంపీడీవో వేముల మల్లేశ్, జిల్లా విజిలెన్స్ అధికారి ఆంజనేయులు, హెచ్‌ఆర్ మల్లేశ్, ఏపీవో షాకీర్ ఉస్మాని ఉన్నారు.


