లక్ష్యానికి చేరువగా..! | - | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి చేరువగా..!

Feb 21 2026 6:59 AM | Updated on Feb 21 2026 6:59 AM

లక్ష్యానికి చేరువగా..!

లక్ష్యానికి చేరువగా..!

ఇప్పటికే 84శాతం పనిదినాలు పూర్తి గడువులోగా పూర్తయ్యేలా అధికారుల చర్యలు ఏప్రిల్‌ నుంచి ఉపాధిహామీ పథకంలో మార్పులు వీబీ– జీరామ్‌ జీగా పేరు మార్పు

తిర్యాణి: దార్రిద్యరేఖకు దిగువనున్న కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మ గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం జిల్లాలో మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు పాత విధానంలో కుటుంబానికి 100 రోజుల పనిదినాలను కల్పించనుండగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2026 –27) నుంచి పథకంలో పలు మార్పులు తీసుకురానున్నారు. అందులో భాగంగా పథకం పేరును వీబీ–జీరామ్‌ జీగా కేంద్రం మార్చింది. ఈ నేపథ్యంలో కుటుంబానికి 125 రోజుల పాటు పనిని కల్పించేలా నిబంధనలు సైతం రూపొందించింది. కాగా జిల్లాలో మొత్తంగా 1,22,035 జాబ్‌కార్డులు ఉండగా అందులో 2,43,969 మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

23.96 లక్షల పని దినాలు కల్పన..

ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రతీ ఆర్థిక సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా పని దినాల లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని అందుకు తగ్గట్టుగా పని దినాలను కూలీలకు కల్పిస్తుంటారు. అందులో భాగంగా 2025 –26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 28.31 లక్షల పని దినాలను కల్పించాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు జిల్లాలోని కూలీలకు 23.96 లక్షల పనిదినాలు కల్పించారు. ఇందుకు గాను రూ.58.40 కోట్లు వేతనాల రూపంలో కూలీలకు అందజేశారు. కాగా ఇప్పటి వరకు 84 శాతం పనిదినాల లక్ష్యం చేధించారు. ఉపాధి కూలీలకు రూ.307 గరిష్ట వేతనం కాగా జిల్లాలో రూ.237 సగటు కూలీ అందుతుంది. అయితే ఇప్పటికే వానాకాలానికి సంబంధించిన పనులు పూర్తవడంతో కూలీలు ఉపాధి పనులకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 13 వేల నుంచి 15 వేల వరకు కూలీలు పనులకు వెళ్తుండగా రానున్న వారం రోజుల్లో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన గడువు ముగిసేలోపు లక్ష్యానికి మించి పనిదినాలు పూర్తయ్యే అవకాశం లేకపోలేదు. కాగా గత ఏడాది సైతం జిల్లాలో లక్ష్యానికి మించి ఉపాధి పని దినాలను కల్పించారు. జిల్లాలో ప్రస్తుతం ఎక్కువగా చేను గట్ల వెంబడి కందకాల తవ్వకాలు, మట్టి రోడ్ల నిర్మాణం, చెరువుల పూడికతీత, కుంటాల నిర్మాణం వంటి పనులు చేపడుతున్నారు.

చేరుకుంటాం..

2025 –26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పని దినాల లక్ష్యం చేరుకునేలా క్షేత్ర స్థాయిలో చర్యలు చేపడుతున్నాం. నిత్యం ఉపాధిహామీ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తూ గడువులోగా లక్ష్యం చేధించేలా ప్రణాళికలు అమలు పరుస్తున్నాం. – దత్తారాం,

డీఆర్‌డీవో, ఆసిఫాబాద్‌

జిల్లాలో 2025 –26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనిదినాల వివరాలు..

మండలం పూర్తయిన కూలీలకు

పనిదినాల చెల్లించిన వేతనం

సంఖ్య (రూ. కోట్లలో)

ఆసిఫాబాద్‌ 1,72,809 4.07

బెజ్జూర్‌ 1,40,351 3.45

చింతలమానెపెల్లి 84,952 2.12

దహెగాం 2,11,114 4.84

జైనూర్‌ 1,62,218 4.05

కాగజ్‌నగర్‌ 1,81,109 4.30

కెరమెరి 2,65,529 6.80

కౌటాల 1,92,061 4.96

లింగాపూర్‌ 1,06,266 2.73

పెంచికల్‌్‌పేట్‌ 1,05,381 2.48

రెబ్బెన 1,45,967 3.29

సిర్పూర్‌(టీ) 1,60,044 3.81

సిర్పూర్‌(యూ) 67,530 1.65

తిర్యాణి 2,36,085 5.42

వాంకిడి 1,64,382 4.04

మొత్తం 23,95,798 58.40

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement