● కాలనీల్లో గడపగడపకూ వెళ్తున్న అభ్యర్థులు, నేతలు ● దావత
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు వాడవాడలా.. గడపగడపకూ ప్రచారం చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మందు, విందులతోపాటు దావత్‌లు ఇస్తూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. సాయంత్రం వేళల్లో మద్యం బాటిళ్లతో విందులు జరుపుకొంటున్నారు. మహిళలు పోటీ చేస్తున్న చోట వారి భర్తలు, సోదరులు, బంధువులు ప్రచారం చేస్తుండగా, భర్తలు బరిలో నిలిచిన వార్డుల్లో భార్యలు, కుటుంబ సభ్యులతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు కార్యకర్తలు, అనుచరులను కూడా వెంట తిప్పుకోవాల్సి రావడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. భోజనం, ప్రయాణం, మద్యం, ఇతర అవసరాలకు చేస్తున్న ఖర్చు హద్దులు దాటుతోంది.
ఖర్చులు భరిస్తూ..
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 13,927 మంది ఓటర్లు, కాగజ్‌నగర్‌లోని 30 వార్డుల్లో 51,205 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో తొలిసారి చైర్మన్ పీఠం కై వసం చేసుకునే దిశగా ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు కొంతమంది ఇప్పటికే వార్డుల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను మచ్చిక చేసుకున్నారు. వారి ఖర్చులు కూడా భరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ బీసీ జనరల్, కాగజ్‌నగర్ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలు చైర్‌పర్సన్ పీఠంపై గురి పెట్టారు. ముందుగానే చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనలతో ప్రధా న పార్టీలు గోప్యంగా ప్రచారం చేసుకుంటున్నాయి. పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు మాత్రం ఏ మా త్రం వెనుకాడకుండా ఖర్చు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ముమ్మరంగా ప్రచారం చేశాయి. కాలనీల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో ర్యాలీలు నిర్వహించారు. ఉదయం తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం సాయంత్రం వరకు వార్డులు తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. కుటుంబ సమేతంగా గడపగడపకూ వెళ్తూ ఒకసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతున్నారు.
అధికార యంత్రాంగం సన్నద్ధం
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ కె.హరిత పర్యవేక్షణలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లతో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కలెక్టర్ ఎన్నికల విభాగం అధికారులతో పలుసార్లు సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రెండు మున్సిపాలిటీల్లో 65,110 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా 113 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆసిఫాబాద్‌లో 28, కాగజ్‌నగర్‌లో 85 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 113 మంది పోలింగ్ అధికారులతోపాటు 20 శాతం అదనపు పీవోలతో 136 మందిని నియమించారు. ఆసిఫాబాద్‌లో 34 మంది, కాగజ్‌నగర్‌లో 102 మంది ఉన్నారు. 339 ఏపీవోలు 20 శాతం అదనపు ఏపీవోలతో 407 మందిని నియమించారు. వీరిలో ఆసిఫాబాద్‌లో 101 మంది, కాగజ్‌నగర్‌లో 306 మంది ఉన్నారు. 25 మంది రిటర్నింగ్ అధికారులు, 25 మంది ఏఆర్వోలను నియమించగా, ఒక్కో విభాగంలో ఏడుగురిని రిజర్వ్‌లో ఉంచారు. 13 మంది జోనల్ అధికారులను నియమించారు. 2 ఎఫ్‌ఎస్‌టీ, 4 ఎస్‌ఎస్‌టీలను నియమించారు.
● కాలనీల్లో గడపగడపకూ వెళ్తున్న అభ్యర్థులు, నేతలు ● దావత


