పల్లెల్లో కుష్ఠు కలకలం! | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో కుష్ఠు కలకలం!

Feb 7 2026 10:10 AM | Updated on Feb 7 2026 10:10 AM

పల్లెల్లో కుష్ఠు కలకలం!

పల్లెల్లో కుష్ఠు కలకలం!

అవగాహన లేక విస్తరిస్తున్న వ్యాధి ఒకే గ్రామంలో 30మంది బాధితులు! రోగుల గుర్తింపునకు వైద్యశిబిరాలు స్క్రీనింగ్‌ పరీక్షలు ముమ్మరం

చింతలమానెపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కుష్ఠు విస్తరిస్తుండడం కలకలం రేపుతోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తుండటంతో బాధితులు వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 115 మంది బాధితులున్నట్లు వైద్యులు తెలిపారు. చింతలమానెపల్లి మండలంలోని ఓ గ్రామంలో 30మందికి కుష్ఠు సోకినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రేతో వ్యాప్తి చెందుతుంది. దీర్ఘకాలికంగా చికిత్స తీసుకోని రోగి వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సన్నిహితంగా మెలిగేవారికి వ్యాధి సోకుతుంది. వ్యాధిగ్రస్తుడి తుంపర్ల ద్వారా క్రిములు గాలిలోకి చేరి ఇతరులకు సోకే అవకాశముంటుంది. సాధారణ స్పర్శ అంటే.. చేతులు కలపడం, కలిసి భోజనం చేయడం ద్వారా కుష్ఠు సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.

బాధితుల గుర్తింపునకు ‘స్క్రీనింగ్‌’

చర్మంపై తెల్లటి, ఎర్రటి మచ్చలు కనిపించడం.. మచ్చలున్న చోట స్పర్శ లేకపోవడం.. చేతులు, కాళ్లలో నొప్పి, మంటగా ఉండడం.. వేళ్లు వంకరగా మారడం లాంటివి వ్యాధి లక్షణాలు. వీటిని గుర్తిస్తే అనుమానించవచ్చు. వెంటనే ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలను సంప్రదించాలి. అక్కడ పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఉప కేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల్లో కుష్ఠు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. అలాగే, వ్యాధిగ్రస్తుల గుర్తింపు కోసం స్క్రీనింగ్‌ పరీక్షలు, ప్రత్యేక సర్వేలు చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

ప్రజల సహకారం అవసరం

కుష్ఠు నివారణకు ప్రజల సహకారం అవస రం. వైద్యారోగ్యశాఖతో పాటు అన్ని శాఖల సిబ్బంది, అధికారులు కృషి చేయాలి. ఎక్కడైనా అనుమానిత లక్షణాలుంటే వైద్యసిబ్బందికి వారి సమాచారం ఇవ్వాలి. వ్యాధి సోకినవారు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దు. చికిత్స అందించేందుకు వైద్యులు అందుబా టులో ఉన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉ చితంగా మందులు అందజేస్తున్నాం. వైద్యశి బిరాలు నిర్వహించి బాధితులను గుర్తించడంతోపాటు చికిత్స చేస్తున్నాం. – సీతారాం,

జిల్లా వైద్యాధికారి, కుమురంభీం ఆసిఫాబాద్‌

ఇదీ.. జిల్లాలో పరిస్థితి

జిల్లావ్యాప్తంగా కుష్ఠు విస్తరిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య పెరిగిన ట్లు చెబుతున్నారు. గ్రామీణ మండలాల్లో వ్యాధి విస్తరిస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో గతంలో ఒక గ్రామంలో తక్కువ సంఖ్యలో ఉన్న వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రస్తుతం 30కి చేరినట్లు సమాచారం. వ్యాధిపై అవగాహన లేకపోవడం, ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతోనే కుష్ఠు విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. కుష్ఠు సోకిన వారిపై వివక్ష చూపే అవకాశం ఉండడంతో వ్యాధిగ్రస్తులు వివరాలు బహిర్గతం చేయడం లేదని వైద్యాధికారులు వెల్లడించారు. కానీ ఇది కూడా వ్యాధి మరింత విస్తరించేందుకు కారణమవుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి సీతారాం, వైద్య బృందం గ్రామాల్లో వ్యాధిగ్రస్తులు గుర్తింపునకు పరీక్షలు నిర్వహించారు. వ్యాధి తగ్గాలంటే తగిన సలహాలు, సూచనలు పాటించాలని, చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అనుమానిత లక్షణాలుంటే ధైర్యంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. జిల్లాలో ఏపీఎంవో, డీపీఎంలను నియమించి చికిత్స అందిస్తున్నారు. కాగజ్‌నగర్‌, ఆసిఫా బాద్‌లో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. బాధితులతో ప్రజలు, సమాజం ఎలాంటి వివక్ష చూపకుండా అండగా నిలవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement