వేతనాలు మహా ప్రభో..
మిషన్ భగీరథ కార్మికులకు ఆరు నెలలుగా పెండింగ్ త్వరలో నిరవధిక సమ్మెబాట! వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం
ప్రధాన డిమాండ్లు ఇవే..
తిర్యాణి: మిషన్ భగీరథ(గ్రిడ్) పథకం కింద ఇంటింటికీ సురక్షిత తాగునీటి సరఫరాలో కాంట్రాక్టు కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ పథకంలో చాలీచాలని వేతనాలతో వీరు విధులు నిర్వహిస్తున్నారు. అవికూడా సక్రమంగా విడుదల చేయకపోవడంతో కుటుంబ పోషణకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే నిరవధిక సమ్మె బాట పట్టనున్నట్లు కార్మికులు స్పష్టం చేస్తున్నారు. త్వరలో వేసవి ప్రారంభం కానుండటంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు అందకపోతే తీవ్రమైన తాగునీటి కటకట ఏర్పడే ప్రమాదం ఉంది.
ఇబ్బందుల్లో కార్మికులు..
జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో కాంట్రాక్టు పద్ధతిలో వాల్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, సూపర్‌వైజర్లు, కూలీలుగా సుమారు 600 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. సూపర్‌వైజర్లకు రూ.15 వేలు, మిగిలిన వారికి రూ.13 వేల చొప్పున చెల్లిస్తున్నారు. వీరందరూ విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో బైక్‌ల్లో పెట్రోల్ పోయించుకోవడానికి కూడా డబ్బులు లేక అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ వేతనాల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడతామని పేర్కొంటున్నారు.
పట్టించుకోవడం లేదు
ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రతినెలా క్రమంతప్పకుండా వేతనాలు చెల్లించాలని పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. అప్పు చేసి విధులకు హాజరవుతున్నాం. వెంటనే అధికారులు స్పందించాలి.
– దుర్శెట్టి సతీశ్, మిషన్ భగీరథ కార్మికుడు
త్వరలో ఆందోళనలు
మిషన్ భగీరథలో కాంట్రా క్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించా లి. గ్రీన్ చానెల్ ద్వారా కనీ సం రూ.26 వేల వేతనం చెల్లించాలి. రెండు, మూ డు రోజుల్లో వేతనాలు విడుదల చేయకపోతే కార్మికులతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం. – బోగే ఉపేందర్,
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
వేతనాలు మహా ప్రభో..
వేతనాలు మహా ప్రభో..


