
గంజాయిపై డ్రోన్ నిఘా
నిషేధిత పంట సాగుపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు రాష్ట్రంలోనే తొలిసారి డ్రోన్ సాంకేతికత వినియోగం కెరమెరి మండలంలో 51 గంజాయి మొక్కలు పట్టివేత సమాచారం అందిస్తే పారితోషికం ఇస్తామని ఎస్పీ ప్రకటన
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం అంతాపూర్ పంచాయతీ నారాయణగూడ గ్రామ శివారులో ఆదివారం రాష్ట్రంలో తొలిసారి పోలీసులు డ్రోన్ సాంకేతికత వినియోగించి పంట చేలలో సాగుచేస్తున్న పత్తిమొక్కలను గుర్తించారు. ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో డ్రోన్ సాయంతో గాలించి ఒక్కరోజే 51 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. నారాయణగూడకు చెందిన రాథోడ్ బాలాజీపై కేసు నమోదు చేశారు.
దహెగాం(సిర్పూర్): జిల్లాలో గంజాయి సాగుపై పోలీసుశాఖ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో తొలిసారి డ్రోన్ సాయంతో గాలించి పత్తి చేలలో పెంచుతున్న గంజాయి మొక్కలను గుర్తిస్తున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పట్టుకోవడం గతంలో పోలీసులకు కష్టంగా ఉండేది. ఎవరైనా సమాచారం ఇస్తే దాడులు చేసి మొక్కలు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసులు నమోదు చేసేవారు. కానీ ప్రస్తుతం పోలీసులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే కెరమెరి మండలం నారాయణగూడ గ్రామ శివారులో 51 గంజాయి మొక్కలను డ్రోన్ ద్వారా గుర్తించారు. ఏఎస్పీ చిత్తరంజన్ స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేస్తూ పత్తి చేలను పరిశీలించారు. అలాగే లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో 35 గంజాయి మొక్కలను పట్టుకున్నారు.
వెయ్యికి పైగా మొక్కలు పట్టివేత
జిల్లాలో మారుమూల మండలాల్లో వివిధ పంటల్లో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నారు. కెరమెరి, జైనూర్, లింగా పూర్, చింతలమానెపల్లి, కౌటాల, రెబ్బెన, దహెగాం తదితర మండలాల్లో సాగు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ఇప్పటివరకు 57 గంజాయి కేసులు నమోదు చేశారు. వెయ్యికి పైగా మొక్కలను స్వాధీనం చేసుకోగా, రూ.1.08 కోట్ల విలువైన 14.7 కిలోల ఎండుగంజాయిని పట్టుకున్నారు. గంజాయి సాగు, క్రయవిక్రయాల గురించి సమాచారం ఇస్తే పారితోషకం ఇస్తామని ఎస్పీ ప్రకటించారు. తద్వారా సాగు గురించి మరింత సమాచారం తెలుస్తుందని భావిస్తున్నారు.
అనర్థాలపై అవగాహన
గంజాయికి అలవాటు పడితే జరిగే అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా రు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలతోపాటు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకం, విని యోగం చట్టపరంగా నేరమని వివరిస్తున్నారు. అక్ర మ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అవసరమైతే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. గంజాయి రహిత జిల్లా సాధనలో యువత, ప్రజలు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు.
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. డ్రోన్ సాంకేతిక సహాయంతో గంజాయి సాగును గుర్తిస్తున్నాం. ఆదివారం కెరమెరి మండలం నారాయణగూడలోని పంట చేలలో డ్రోన్‌తో గంజాయి మొక్కలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాం. సాగు, రవాణా, వినియోగం, అమ్మకాలు జరిపే వారిపై నిఘా పెంచాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. యువత, ప్రజలు గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా 8712670551, డయల్ 100 నంబర్లకు తెలియజేయాలి.
– కాంతిలాల్ పాటిల్, ఎస్పీ

గంజాయిపై డ్రోన్ నిఘా