
వ్యాపారిపై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మద్యం టెండర్లలో నిబంధలకు విరుద్ధంగా అడ్డదారుల్లో అప్పులు ఇస్తూ దందా చేయాలని ఎత్తుగడ వేసిన వ్యాపారులపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నెల 8న ‘సాక్షి‘లో ‘అప్పులిస్తా.. దందా చేస్తాం!’అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లలో రూ.లక్షల కొద్ది అప్పులు ఇచ్చి, లక్కీ లాటరీలో షాపు వచ్చినా, రాకున్నా, నిర్వాహకులే లాభం పొందేలా పది కండీషన్లలో ఓ ఒప్పంద పత్రం విడుదల చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరిపి కాగజ్‌నగర్‌కు చెందిన వ్యాపారి గజ్జల శ్రీనివాస్‌పై రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డబ్బుల పంపిణీ, బహుమతుల ఆశ చూపిస్తూ సభ్యులను చేర్చుకోవడం వంటివి నిషేధం. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీం చట్టంలో సెక్షన్ 3, 4 కింద ప్రకారం ఆయనపై కేసు నమోదైంది. మరోవైపు ఇదే తరహాలో మరికొందరు రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యాపారులు సైతం అమాయకులకు మద్యం టెండర్ల పాల్గొనేలా ముందుగా అప్పు రూపంలో ఇస్తూ తర్వాత తీసుకునే విధంగా ఎత్తువేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా లోలోపల నడుపుతున్నట్లు సమాచారం.
ఎఫెక్ట్