
మగువలకు బతుకమ్మ కానుక
మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా చీరలు మరో రెండు రోజుల్లో జిల్లాకు చేరనున్న స్టాక్ జిల్లాలో 1,02,992 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు
సభ్యులు చీరలు చీరలు
ఆసిఫాబాద్‌అర్బన్: బతుకమ్మ పండుగ నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేయనుంది. గతంలో తెల్లరేషన్ కార్డు ఉన్న 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ చీరలు అందించగా, ప్రస్తుతం ఎస్‌హెచ్‌జీ సభ్యులకు మాత్రమే ఇందిరా మహిళా శక్తి కింద అందించనున్నారు. మరో రెండు రోజుల్లో అవసరమైన స్టాక్ జిల్లాలోని గోదాంలకు చేరుకోనుంది. సద్దుల బతుకమ్మకు ముందుగానే అర్హులకు అందించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
నాణ్యతపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో మొత్తం 8,897 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 1,02,992 మంది సభ్యులు గా కొనసాగుతున్నారు. మహిళా సంఘాల్లో ప్రస్తు తం 18 ఏళ్లు నిండిన వారికే అవకాశం ఉంది. ‘రేవంతన్న కానుక’గా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందించనుంది. గత ప్రభుత్వ హయాంలోనూ చీరలు పంపిణీ చేసినా నాణ్యతపై విమర్శలు వచ్చాయి. గతంలో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డులో పేరున్న ప్రతీ మహిళకు బతుకమ్మ చీరలు అందించారు. నాణ్యత సక్రమంగా లేకపోవడం, డిజైన్లు ఒకేరీతిలో ఉండడంతో చాలా మంది వాటిని ధరించలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొదట చీరల పంపిణీని నిలిపివేసింది. ప్రస్తుతం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి మళ్లీ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. క్షేత్రస్థాయిలో విమర్శలు రాకుండా మన్నికైన చీరల కోసం ఒక్కోదానికి సుమారు రూ.800 వెచ్చించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మొదటి విడతలో ఒకటే..!
బతుకమ్మ కానుకగా ఒక్కో మహిళకు రెండు చొప్పు న చీరల అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొదటి విడత ఒక్కటి మాత్రమే ఇవ్వనున్నారు. మరో రెండు రోజుల్లో జిల్లాకు 1,02,992 చీరలు రానున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీటిని కౌటాల, జైనూర్, రెబ్బెన మండలం రాంపూర్‌లోని గోదాంలలో భద్రపర్చనున్నారు. గోదాంల నుంచి ఆయా గ్రామాలకు అవసరం మేరకు సరఫరా చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో మహిళా సంఘాలు, సభ్యుల సంఖ్య, ఏయే ప్రాంతాలకు ఏ మేరకు సరఫరా చేయాలనే వివరాలను మెప్మా, సెర్ప్ సిబ్బంది సేకరించారు. ఉన్నతాధికారులకు సైతం నివేదించారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 900 ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లు, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 279 గ్రూపుల్లో సభ్యులకు చీరలు అందించనున్నారు.
రెండు రోజుల్లో జిల్లాకు..
బతుకమ్మ కానుకగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ప్రభుత్వం ఉచితంగా చీరలు అందించాలని నిర్ణయింది. మరో రెండు రోజుల్లో అవసరమైన చీరలు జిల్లాకు చేరుకుంటాయి. వీటిని భద్రపరిచేందుకు వీలుగా జిల్లాలోని మూడు ప్రాంతాల్లో గోదాంలు గుర్తించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం.
– దత్తారావు, డీఆర్‌డీవో
అర్హులు, అవసరమైన చీరల వివరాలు
మండలం ఎస్‌హెచ్‌జీ 6.30మీ. 9మీ.
కాగజ్‌నగర్ 10,658 8,158 2,500
ఆసిఫాబాద్ 7,632 5,699 1933
వాంకిడి 8,223 5,023 3200
దహెగాం 5,988 3,588 2400
రెబ్బెన 8,061 4,661 3,400
తిర్యాణి 5,644 3,394 2,250
కౌటాల 6,965 4,179 2,786
సిర్పూర్(టి) 6,021 3,521 2,500
పెంచికల్‌పేట్ 2,909 1,209 1,700
బెజ్జూర్ 5,201 3,180 2,021
చింతలమానెపల్లి 5,317 3,190 2,127
జైనూర్ 6,347 2,539 3,808
కెరమెరి 5,929 2,464 3,465
సిర్పూర్(యూ) 3,658 1,583 2,075
లింగాపూర్ 3,219 1,288 1,931
మున్సిపాలిటీలు
కాగజ్‌నగర్ 8,357 8,327 30
ఆసిఫాబాద్ 2,863 2,613 250