
పత్తాలాట.. కోడిపందేలు
కౌటాల మండలం గురుడుపేటకు చెందిన మహిళలు పేకాటను నియంత్రించాలని ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చి వినతిపత్రం అందించారు. యువత పేకాడుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో నాటుసారా విక్రయాలు, అక్రమ దందాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గురుడుపేట గ్రామంలోనే కాకుండా జిల్లాలోని పలు పల్లెల్లో పరిస్థితి ఇలాగే ఉంది. పత్తాలాట, కోడి పందేలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి.
కౌటాల(సిర్పూర్): మరికొద్ది రోజుల్లో దసరా సంబురాలు ప్రారంభం కానుండగా, జిల్లాలో పేకాట, కోడి పందేలు జోరందుకున్నాయి. పోలీసుల దాడుల్లో కొందరు పట్టబడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా యువత జూద క్రీడలకు బానిసలుగా మారి అప్పులపాలవుతున్నారు. పేకాట, కోడి పందేల నిర్వహణకు ప్రత్యేక స్థావరాలు సైతం ఏర్పాటు చేస్తుండడం గమనార్హం.
ఇదీ పరిస్థితి..
కౌటాల, వాంకిడి, చింతలమానెపల్లి, దహెగాం, పెంచికల్‌పేట్, బెజ్జూర్, సిర్పూర్(టి), జైనూర్ మండలాల్లో పేకాట జోరుగా సాగుతుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని గ్రామాల శివారుల్లోనూ నిత్యం స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల దాడులకు తాత్కాలికంగా భయపడినా మళ్లీ కొత్త ప్రాంతాలను వెతుక్కుంటున్నారు. కాగజ్‌నగర్ పట్టణ శివారులోని ఈజ్‌గాం, భట్టుపల్లి, అంకుసాపూర్ ప్రాంతాలైతే పేకాట స్థావరాలకు పేరుమోశాయి. మరికొందరు బడాబాబులు ఏకంగా సరిహద్దు దాటి మహారాష్ట్రలోని దాబాల్లో రూ.లక్షలు పెడుతూ జూదంలో మునిగిపోతున్నారు.
ఆది, బుధవారాల్లో మహారాష్ట్రకు..
జిల్లాలోని అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే పల్లెల్లో కోడి పందేలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రతీ ఆదివారం, బుధవారం మహారాష్ట్రలో నిర్వహించే కోడి పందేలకు జిల్లా నుంచి పదుల సంఖ్యలో తరలివెళ్తున్నారు. దసరా పండుగకు నిర్వహించే పందేల కోసం ఇప్పటినుంచే ప్రత్యేకంగా పుంజులు పెంచుతున్నారు. రూ.వేలల్లో బెట్టింగ్ కాస్తూ అప్పులపాలవుతున్నారు. పోలీసులు పేకా ట, కోడి పందేలపై దాడులు నిర్వహించినా నిందితులపై పీటీ కేసులు మాత్రమే పెడుతున్నారు. నిందితులు కోర్టుల్లో నామమాత్రపు జరిమానా చెల్లించి బయటపడుతున్నారు. కొందరు పోలీసులు పేకాట నిర్వాహకులకు ముందుగానే సమాచారం ఇస్తూ సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవలి ఘటనలు
కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో చట్టవిరుద్ధంగా పేకాట, కోడిపందేలు ఆడితే చర్యలు తప్పవు. కేసులు నమోదు చేస్తాం. వ్యసనాల బారిన పడి కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. తరుచూ తనిఖీలు, దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నాం. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలి.
– కాంతిలాల్ పాటిల్, ఎస్పీ
గడిచిన ఎనిమిది నెలల్లో నమోదైన కేసులు
దాడులు కేసులు నిందితులు పట్టుకున్న నగదు
పేకాట 90 507 రూ.4,69,470
కోడి పందేలు 16 88 రూ.25,660