
నష్టాలపై నివేదిక సమర్పించాలి
ఆసిఫాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో జరిగిన నష్టాలపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ ఆగస్టులో భారీ వర్షాలతో జరిగిన ప్రాణ, ఆస్తి, పంట నష్టాలపై పూర్తి నివేదికలతో స్పష్టమైన సమాచారం అందించాలన్నారు. వ్యవసాయ రంగం, విద్యుత్, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, మున్సిపల్, జాతీయ రహదారుల శాఖల పరిధిలో జరిగిన నష్టాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలతో జిల్లాలో 3 మరణాలు, 46 నివాస గృహాలు దెబ్బతిన్నాయని, 50 మేకలు మృతి చెందడంతోపాటు 15,003 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. 20 పాఠశాలలు, 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, కల్వర్టులు, రహదారులకు నష్టం జరిగిందన్నారు. వరద నష్టాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక సమర్పిస్తామన్నారు. జీవో 91 ప్రకారం పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.