
68శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన(ఆసిఫాబాద్): ఆగస్టులో వర్షాల కారణంగా బెల్లంపల్లి ఏరియాలో 68 శాతం బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించగలిగామని జీఎం విజయ భాస్కర్‌రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆగస్టులో ఏరియాకు 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 1.36 లక్షల టన్నులు మాత్రమే సాధించి 68 శాతం నమోదు చేసినట్లు తెలిపారు. గత నెలలో భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. ఖైరిగూర ఓసీపీలో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోందని, వర్షాలతో ఓసీపీలో ఉత్పత్తి అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయామని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే కోల్పోయిన ఉత్పత్తిని సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియా 11.76 లక్షల ఉత్పాదకతతో 90శాతంతో ముందుకు సాగుతోందన్నారు.