
మార్కెటింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కైలాస్‌నగర్: మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమాయక ప్రజలను అధిక లాభాల ఆశ చూపి మోసం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయవాడకు చెందిన ఠాగూర్ విజయ్ సింగ్ myv3ads అనే అప్లికేషన్‌లో నమోదై దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి, అందులో నమోదయ్యేందుకు రూ.1,21,000 చెల్లించాలని ఇద్దరికి ఆశచూపి మోసం చేశాడన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టి శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఇంకా ఈ అప్లికేషన్ ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చన్నారు.