బోనస్‌కు ఎదురుచూపులే! | - | Sakshi
Sakshi News home page

బోనస్‌కు ఎదురుచూపులే!

Aug 30 2025 7:22 AM | Updated on Aug 30 2025 7:22 AM

బోనస్

బోనస్‌కు ఎదురుచూపులే!

రైతుల ఖాతాల్లో జమ కాని నగదు జిల్లాలో రూ.2.9 కోట్లు పెండింగ్‌ నెలల తరబడి ఎదురుచూస్తున్న అన్నదాతలు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఆందోళన

ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు వడాయి శివరాం. రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన ఆయన గత యాసంగిలో 4.5 ఎకరాల్లో సన్నరకం వరిసాగు చేశాడు. అంతకు ముందు వానాకాలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ వచ్చింది. దీంతో యాసంగిలో పండిన 60 క్వింటాళ్ల ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాడు. అయితే ధాన్యానికి మాత్రమే మద్దతు ధర ప్రకారం డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కాగా, బోనస్‌ మాత్రం ఇప్పటికీ అందలేదు. జిల్లాలో ఇది ఒక్క శివరాం పరిస్థితే కాదు. యాసంగిలో సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించిన వారందరూ బోనస్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

రెబ్బెన(ఆసిఫాబాద్‌): సన్నరకం వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన జిల్లా రైతులు బోనస్‌ నగదు కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో వారిలో ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ వరి ధాన్యానికి బోనస్‌ చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు గత వానాకాలం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లించింది. యాసంగిలో పండించిన ధాన్యానికి మాత్రం ఇప్పటివరకు చెల్లించలేదు. ధాన్యం అమ్మి నెలలు గడుస్తుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు.

5,800 మెట్రిక్‌ టన్నులు సేకరణ

జిల్లాలోలోని రైతులు యాసంగి సీజన్‌లో 24వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు 5,800 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం సేకరించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ప్రభుత్వం రూ.500 బోనస్‌ చెల్లిస్తామని ప్రకటించింది. సర్కారుపై నమ్మకంతో చాలామంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే సన్నరకం ధాన్యాన్ని విక్రయించారు. విక్రయ సమయంలో అకాల వర్షాలు పడ్డాయి. తూకం చేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించకపోవడంతోనూ రైతులకు ఇబ్బందులు ఎదురయ్యా యి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన పంటకు సంబంధించిన డబ్బులను మాత్రమే ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం బోనస్‌ను విస్మరించింది. ఒక్కో రైతుకు వేలాది రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసి దాదాపు రెండున్నర నెలలు గడిచింది. చెల్లింపులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అన్నదాతల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి.

రూ.2.9 కోట్ల బకాయిలు

యాసంగిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నరకం ధాన్యాన్ని విక్రయించిన జిల్లా రైతులకు ప్రభుత్వం నుంచి బోనస్‌ రూపంలో రూ.2.9 కోట్లు రావాల్సి ఉంది. అకాల వర్షాలు, ధాన్యం కొనుగోలులో అధికారుల జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ప్రైవేటుకే అమ్ముకున్నారు. అయితే ప్రైవేటులో రోజురోజుకూ ధర తగ్గించడం, ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ వస్తుందనే ఆశతో మళ్లీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై మొగ్గు చూపారు. జిల్లావ్యాప్తంగా 12,090 మంది రైతులు సుమారు 5,800 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. అధికారులు యాసంగిలో బోనస్‌ చెల్లింపునకు 12,090 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. కేవలం కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రమే డబ్బులను జమ చేసి చేతులు దులుపుకొన్నారు. ప్రభుత్వం బోనస్‌ డబ్బులు చెల్లిస్తే వానాకాలం పంటల సాగుకు ఉపయోగపడతాయని రైతులు ఆశగా ఎదురుచూశారు. మరో రెండున్నర నెలల్లో వానాకాలం పంటల దిగుబడి సైతం చేతికి అందనుంది. ప్రభుత్వంపై ఆశతో వానాకాలంలోనూ అధికంగా సన్నరకాలనే సాగు చేశారు. ధాన్యం చేతికందేలోగా బోనస్‌ రాకపోతే రైతులు మళ్లీ ప్రైవేటు వ్యాపారులకే ధాన్యం విక్రయించాలని భావిస్తున్నారు.

ప్రైవేటుకు వద్దనుకుని..

గత యాసంగిలో ఐదెకరాల్లో మొత్తం సన్నరకం ధాన్యాన్నే పండించిన. తేమతో సంబంధం లేకుండా వడ్లు కొనేందుకు ప్రైవేటు వ్యక్తులు కల్లం వద్దకే రావడంతో 20 క్వింటాళ్ల వరకు ప్రైవేటుకే అమ్మిన. ప్రభుత్వం సన్నరకానికి బోనస్‌ కూడా ఇస్తుండటంతో ప్రైవేటుకు వద్దనుకుని మిగిలిన 50 క్వింటాళ్లను కొనుగోలు కేంద్రంలో విక్రయించిన. ధాన్యం డబ్బులు పడ్డయి.. కానీ బోనస్‌ మాత్రం అందలేదు.

– వడాయి కాంతారావు

సాగుకు ఉపయోగపడేవి

రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి ఇస్తామన్న బోనస్‌ డబ్బులు అందిస్తే వానాకాలం పంటల సాగుకు ఉపయోగపడేవి. ధాన్యం విక్రయించి దాదాపు మూడు నెలలు అయితంది. ఇప్పటివరకు డబ్బులు మాత్రం పడలేదు. పైసల కోసం వారానికి ఒకసారి బ్యాంకుకు వెళ్లి ఖాతా చూసుకోవాల్సి వస్తోంది. కనీసం ఎప్పుడు పడతాయో కూడా చెప్పడం లేదు.

– కొట్రంగి హన్మంతు

బోనస్‌కు ఎదురుచూపులే!1
1/3

బోనస్‌కు ఎదురుచూపులే!

బోనస్‌కు ఎదురుచూపులే!2
2/3

బోనస్‌కు ఎదురుచూపులే!

బోనస్‌కు ఎదురుచూపులే!3
3/3

బోనస్‌కు ఎదురుచూపులే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement