
ధ్యాన్‌చంద్ సేవలు వెలకట్టలేనివి
ఆసిఫాబాద్‌రూరల్/ఆసిఫాబాద్‌అర్బన్: క్రీడారంగంలో హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా క్రీడా యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధ్యాన్‌చంద్ క్రీడాస్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లాలో గిరిజన క్రీడాపాఠశాల ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా యువజన సేవల శాఖ ఇన్‌చార్జి అధికారి రమాదేవి, డీడబ్ల్యూవో భాస్కర్, ఏసీఎంవో ఉద్దవ్, జిల్లా క్రీడల అధికారి మీనారెడ్డి, కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, రవి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
నష్టాలపై నివేదికలు రూపొందించాలి
ఆసిఫాబాద్: జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో కలిగిన నష్టాలపై పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూలై, ఆగస్టులో భారీ వర్షాలతో పంచాయతీరాజ్ రోడ్డు భవనాల శాఖల పరిధిలోని రహదారులు కోతకు గురయ్యాయని, కల్వర్టులు తెగిపోయాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల కాలువలకు గండ్లు పడ్డాయని, ప్రాథమిక అంచనా ప్రకారం 15 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. స్తంభాలు పడిపోవడం, తీగలు తెగిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, పశువులు, మేకలు, గొర్రెల ఫొటోలతో కూడిన వివరాల ను అందించాలని ఆదేశించారు. బాధితులకు నష్టపరిహారం మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.