
ముంపు సమస్య సత్వరమే పరిష్కరించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): రెబ్బెన ఎన్టీఆర్ కాలనీ ముంపు సమస్యకు సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో గురువారం పర్యటించారు. వరదనీరు వచ్చే ఏరియాను పరిశీలించారు. ఎగువన ఉన్న వట్టివాగు కాలువలో పూడిక కారణంగా వరద కాలనీలోకి వస్తుందని స్థానికులు తెలిపారు. వట్టివాగు ప్రాజెక్టు డీ10 వద్ద కాలువలో పూడిక తీయాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన నిధులు సైతం మంజూరు చేస్తామన్నారు. డ్రెయినేజీల్లో పూడిక సైతం ఎప్పటికప్పుడు తొలగించాలని, తద్వారా వర్షపు నీరు సులువుగా బయటకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్, సీఐ సంజయ్, ఎస్సై చంద్రశేఖర్, ఆర్‌ఐలు సౌమ్య, ఉదయ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, గోపి, రాజేశ్, చిరంజీవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పంటల నష్టం వివరాలు నమోదు చేయాలి
ఆసిఫాబాద్: భారీ వర్షాలతో జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి గురువారం అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈవోలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజులుగా భారీ వర్షం కురవడంతో జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని, అర్హులైన ప్రతీ రైతు పేరు జాబితాలో ఉండాలని సూచించారు. అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా నివేదిక రూపొందించాలన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో డీఏవో శ్రీనివాసరావు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.