రావయ్యా.. గణపయ్యా | - | Sakshi
Sakshi News home page

రావయ్యా.. గణపయ్యా

Aug 27 2025 9:03 AM | Updated on Aug 27 2025 9:03 AM

రావయ్యా.. గణపయ్యా

రావయ్యా.. గణపయ్యా

● గణేశ్‌ ఉత్సవాలకు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు ● ముస్తాబవుతున్న మండపాలు ● నేడు వినాయక చవితి

ఆసిఫాబాద్‌/కౌటాల: మరికొన్ని గంటల్లో వాడవాడలా గణపయ్య కొలువుదీరనున్నాడు. పార్వతి తనయుడి ఆగమనం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బుధవారం వినాయక చవితి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకొనేందుకు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అందమైన సెట్టింగ్‌లు, లైటింగ్‌తో మండపాలు ఆకర్షనీయంగా ముస్తాబవుతున్నాయి. నవరాత్రులకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కల్పించనున్నారు. 800 మందికి పైగా పోలీస్‌ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 1200లకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు

ఈ ఏడాది సుమారు 1000లకు పైగా గణపతి విగ్రహాలు ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలు, కాలనీలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వా డవాడలా నవరాత్రోత్సవాలు వైభవంగా సాగనున్నాయి. వారం రోజులుగా నిర్వాహకులు విగ్రహాల బుకింగ్‌, విద్యుత్‌ పనులు, లైటింగ్‌ ఏర్పాట్లు, పోలీ సుల నుంచి అనుమతులు పొందడం తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లోనూ విగ్రహాల తయారీదారులు దుకా ణాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బుకింగ్‌ చేసుకున్న వారు ముందస్తుగానే ప్రత్యేక వాహనాల్లో విగ్రహాలను తరలిస్తున్నారు. మరికొందరు కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల పట్టణాల్లో వినాయకుడి ప్రతిమలు కొనుగోలు చేశారు. పీవోపీ విగ్రహ తయారీ ముడిసరుకు, కెమికల్‌, రంగుల ధరలు భారీగా పెరగడంతో ప్రతిమల ధరలు కూడా పెంచారు. ఆరు ఫీట్ల ఎత్తు విగ్రహానికి రూ.15 నుంచి 20 వేల వరకు విక్రయిస్తుండగా, 10 ఫీట్ల విగ్రహానికి రూ.30 నుంచి రూ. 40 వేల వరకు ధర ఉంది. మంటపాల వద్ద తొమ్మిది రోజులపాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్‌లోని ప్రధాన మార్కెట్లు సందడిగా మారాయి. భక్తులు పూజా సామగ్రి కొనుగోలు చేశారు. కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ జిల్లా కేంద్రంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు. మండల కేంద్రాల్లోనూ పోలీసులు వేడుకల నిర్వహణపై పీస్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ.. కమిటీ సభ్యులకు సూచనలు చేస్తున్నారు. విగ్రహాల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు నిమజ్జనం వరకు నిబంధనలపై దిశానిర్దేశం చేశారు.

పత్రాలు, ఫలాలతో పూజలు

వినాయక చవితి పండగ రోజున విఘ్నేశ్వరుడికి 21 రకాల పువ్వులతో పూజిస్తారు. ఔషధ గుణాలు కలిగి ఉండే ఈ ఆకులతో పూజించడం, ఆ తర్వాత వాటిని చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేయడం ద్వారా జలాలు శుభ్రమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మాచి, పత్రి, గరిక, ఉత్తరేణి, ములక, ఉమ్మెత్త, తులసి, మారెడు, రేగు, మామిడి, గన్నేరు, ధవనం, జాజిమల్లె, తెల్లమద్ది, దేవదారు పత్రం, దానిమ్మతో పాటు పలురకాల పత్రాలతో వినాయకుడికి పూజలు చేస్తారు. ఉండ్రాళ్లు, లడ్డూలు, పాయసం దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.

మట్టి విగ్రహాలకు పెరిగిన ప్రాధాన్యం

ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన గణపతులతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. నిమజ్జనం తర్వాత కూడా నీటిలో కరగకుండా ఎక్కువ కాలం ఉండటంతో నీటి వనరుల్లో కాలుష్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మట్టి గణపతులు ప్రతిష్టించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గతంలో 335 గ్రామ పంచాయతీలకు ప్రతీ పంచాయతీకి పది చొప్పున అధికారులే మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. సోమవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఆవరణలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. అలాగే జిల్లా కేంద్రంలో వాసవీక్లబ్‌, పద్మశాలి సంఘం, వివిధ స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement