
సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆసిఫాబాద్: ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరి తగతిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇటీవల వర్షాలకు తన ఇల్లు కూలిపోయిందని, పరిహారం చెల్లించాలని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌కు చెందిన సమీన బేగం దరఖాస్తు చేసుకుంది. రెబ్బెన మండలం గంగాపూర్ శివారులో కొనుగోలు చేసిన భూమికి పట్టా పాస్‌పుస్తకం జారీ చేయాలని గ్రామానికి చెందిన ఇగురపు తార అర్జీ సమర్పించింది. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ శివారులోని మైనార్టీ గురుకులంలో తన కుమార్తెకు సీటు ఇప్పించాలని కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్‌కు చెందిన సమిత్‌దాస్ విన్నవించాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట నీట మునిగిందని, పరిహారం చెల్లించాలని కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్‌కు చెందిన సుమతి మండల్ కోరింది. తనకు జారీ చేసిన పట్టా పాస్‌పుస్తకంలో పేరు తప్పుగా నమోదైందని, దానిని సవరించాలని నజ్రూల్‌నగర్‌కు చెందిన చంద్రకాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. కాగజ్‌నగర్ ఎస్పీఎం ఓల్డ్ కాలనీలో పందుల సంచారం అరికట్టాలని కాలనీ ప్రజలు కలెక్టర్‌ను వేడుకున్నారు. అక్షర చిట్‌ఫండ్‌లో దాచుకున్న డబ్బులు ఇప్పించాలని జిల్లా కేంద్రానికి చెందిన పలువురు వ్యాపారులు విన్నవించారు.
నిషేధిత జాబితా నుంచి తొలగించాలి
ఆసిఫాబాద్ మండలం బూర్గుడ శివారులోని సర్వే నం.91/ఈలో మూడెకరాల పట్టా భూమి ఉంది. సదరు భూమిని విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లగా నిషేధిత జాబితాలో ఉందని తెలిసింది. గత జూన్‌లో దరఖాస్తు చేసుకున్నాను. పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలి. – సైదం తిరుపతి, బూర్గుడ, మం.ఆసిఫాబాద్

సమస్యల పరిష్కారానికి చర్యలు