
మట్టి గణపతులను పూజిద్దాం
ఆసిఫాబాద్‌అర్బన్: మట్టి గణపతులు పూజించి, పర్యావరణాన్ని కాపాడుకుందామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీటి కాలుష్యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి సజీవన్ తదితరులు పాల్గొన్నారు.
‘భూభారతి’ దరఖాస్తులు పరిష్కరించాలి
భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా సర్వే ల్యాండ్ అసిస్టెంట్ డైరెక్టర్ సోమేశ్వర్‌లతో కలిసి తహసీల్దార్లు, డీటీలు, మండల సర్వేయర్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో సమీక్షించారు. దరఖాస్తులను రికార్డులతో సరిచూసి, క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలన్నారు. పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.