
సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
కాగజ్‌నగర్‌టౌన్: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు విమర్శించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాగజ్‌నగర్– పెంచికల్‌పేట్ ప్రధాన రహదారిపై రైతులతో కలిసి గంట పాటు రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఉదయం 5గంటల నుంచి ఎదురుచూస్తుండగా ఎరువులు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పీఏసీఎస్ డైరెక్టర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్నారు. వ్యవసాయాధికారి రామకృష్ణ యూరియా పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని చెప్పినప్పటికీ రాస్తారోకో కొనసాగించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేయగా కొంత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఎమ్మెల్యేను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు రైతులను సముదాయించి అక్కడి నుంచి పంపించారు.