
మరిన్ని సంఘాలు
60 ఏళ్లు దాటిన మహిళలు, కిశోర బాలికలు, దివ్యాంగులకు చాన్స్ సభ్యులను గుర్తించే పనిలో ఐకేపీ సిబ్బంది నెలాఖరులోగా ఏర్పాటుకు ఆదేశాలు దివ్యాంగుల కేటగిరీలో పురుషులకు చోటు
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వాలు 60 ఏళ్లు దాటిన మహిళలకు సంఘంలో చోటు కల్పించలేదు. కానీ ఈ ప్రభుత్వం వృద్ధులకు ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేస్తోంది. కిశోర బాలికలకు, దివ్యాంగులకు సైతం సంఘంలో చోటు కల్పించి వారిని కూడా ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం జిల్లాలోని అన్ని మండలాల్లో సర్వేలు నిర్వహిస్తోంది.
కెరమెరి(ఆసిఫాబాద్): జిల్లాలో కొత్తగా మరిన్ని మహిళా సంఘాలు ఏర్పాటు కానున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి కిశోర బాలికలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులను గ్రూపుల్లో చేర్చనున్నారు. దివ్యాంగులకు సైతం నూతనంగా సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కోటి మందిని సంఘాల్లో చేర్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త సంఘాల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సంఘాల ఏర్పాటు కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా సామాజిక కోణంలో ఆలోచించి వృద్ధులు, కిశోర బాలికలు, దివ్వాంగులను కూడా సంఘాలుగా ఏర్పాటు చేసి వారికి ఆసరాగా నిలవాలని భావిస్తోంది. సదరు కేటగిరీకి చెందిన వారిని ఈ నెలాఖరులోగా గుర్తించి ఖాతాలు తెరిపించే పనిలో సెర్ప్ ఉద్యోగులు నిమగ్నమయ్యారు.
పొదుపు నిర్ణయం వారిదే..
పొదుపు ఎంత చేయాలనే నిర్ణయం ఆ సంఘంలో ఉన్న సభ్యులదే. సంఘాలుగా ఏర్పడిన వారు ఇంత మొత్తంలో పొదుపు చేయాలనే షరతు ఏమీ లేదు. వారి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి నెలనెలా కావాల్సినంత పొదుపు చేసుకోవచ్చు. ఇప్పుడున్న పొదుపు సంఘాల మాదిరిగానే ఈ సంఘాలు కూడా నెలకోసారి సమావేశాలు నిర్వహించి పొదుపు డబ్బులు కట్టడం, బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం, మ్యాచింగ్ గ్రాంటు పొందడం, రికార్డులు నిర్వహణ వంటివి చేసుకోవచ్చు. వీవోఏలు కూడా వీరికి సహకరించనున్నారు.
సంఘం ఏర్పాటు ఇలా..
60 సంవత్సరాలు పైబడిన మహిళలంతా వృద్దుల సంఘంలో చేరవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైన మహిళా సంఘంలో కొనసాగుతున్న వారుంటే చేరనవసరం లేదు. కిశోర బాలికల్లో మాత్రం రెండు గ్రూపులుగా సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. 11 నుంచి 14 సంవత్సరాల వరకు ఒక గ్రూపు, 14 నుంచి 18 సంవత్సరాల వరకు మరోగ్రూపు తయారు చేస్తున్నారు. ఈ సంఘాల్లో కనీసం పదిమంది సభ్యులు ఉండాలి. కానీ దివ్యాంగుల సంఘాల ఏర్పాటుకు 5 నుంచి 10 మంది ఉండే అవకాశం కల్పించాలి. అయితే దివ్యాంగుల సంఘంలో మహిళలతో పాటు పురుషులు కూడా ఒక సంఘంగా ఏర్పడే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది,
అవగాహన కల్పిస్తున్నాం
జిల్లాలోని అన్ని మండలాల్లో వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికల కోసం నూతనంగా సంఘాల ఏర్పాటుకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్ని మండలాల్లో ఐకేపీ ఏపీఎం, సీసీలు సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సంఘాలను గుర్తించి ఖాతాలు తెరిపించి వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆదేశించాం. ఈ నెలాఖరు వరకు సంఘాల ప్రకియ పూర్తి చేయాలి.
– దత్తారాం, డీఆర్డీవో
సంఘాలు ఎందుకంటే..
సంఘాల్లో ఉన్న ఎంతోమంది మహిళలు పొదుపు డబ్బులు, రుణం ద్వారా కుటీర, ఉపాధి వనరులు, చిన్నచిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటూ కుటుంబ పోషణలో భాగస్వామ్యం అవుతున్నారు. వయస్సు పైబడిన వారు ఇంటికే పరిమితమై తాము ఒంటరిగా ఉన్నామనే ధ్యాసలోపడి మానసిక వ్యథకు గురికాకుండా సంఘంగా ఏర్పడితే వారిలో తన కోసం నలుగురు ఉన్నారనే మానసిక స్థైర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. కిశోర బాలికలను కూడా సంఘాల్లో చేర్పించి సమాజంలో మంచి, చెడులను తెలుసుకునే అవకాశం కల్పించింది. దివ్యాంగులు కూడా తాము ఎవరికీ తీసిపోమనే విధంగా ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి అండగా నిలవాలని ప్రభుత్వం భావించింది.

మరిన్ని సంఘాలు