
జూనియర్లకు ‘ఎఫ్‌ఆర్‌ఎస్’
యాప్‌లో హాజరు నమోదు ప్రక్రియ షురూ పారదర్శకత పెంచేందుకు కొత్త విధానం వసతిగృహాల్లో అమలుపై సందిగ్ధం
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి అమలులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్‌ఆర్‌ఎస్)ను ఇప్పుడు విద్యార్థులకు కూడా విస్తరించారు. ఈ నెల 23 నుంచి విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో రిజిస్టర్ ద్వారా హాజరు నమోదు జరిగేది. ఈ కొత్త వ్యవస్థ విద్యార్థుల హాజరును కచ్చితంగా ట్రాక్ చేయడంతోపాటు అవకతవకలను నిరోధించడానికి ఉపయోగపడనుంది. కేంద్ర ప్రభుత్వ యుడాయి సంస్థతో సాంకేతిక ఒప్పందం ముగిసినప్పటికీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సహకారంతో ఈ విధానం కొనసాగుతోంది.
హాజరు నమోదు ప్రక్రియ..
మంచిర్యాల జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 165 మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 4,320 మంది విద్యార్థులు చదువుతున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 11 జూనియర్ కళాశాలల్లో 4,360 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 231 మంది అధ్యాపకులు బోధిస్తున్నారు. హాజరు నమోదు కోసం సీజీజీ సాంకేతిక సహకారంతో టీజీబీఐఈ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో కళాశాల సిబ్బంది తమ మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. ఒకవేళ విద్యార్థి కళాశాలకు హాజరు కాకపోతే, వారి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. రోజువారీ హాజరు డేటాను రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. తరగతులకు సక్రమంగా హాజరు కాకపోవడమే ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు విఫలమవడానికి ప్రధాన కారణమని గుర్తించిన అధికారులు, ఈ విధానం ద్వారా పారదర్శకతను పెంచాలని భావిస్తున్నారు.
వసతిగృహాల్లో హాజరు సమస్యలు..
వసతిగృహాల్లో పర్యవేక్షణ లోపంతో విద్యార్థుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఈ గృహాల్లో మాన్యువల్ రిజిస్టర్ ద్వారా హాజరు నమోదు జరుగుతోంది. మంచిర్యాల జిల్లాలో 17 ఎస్సీ పోస్ట్‌మెట్రిక్, 8 ప్రీమెట్రిక్ వసతిగృహాలు ఉన్నాయి. ప్రీమెట్రిక్ గృహాల్లో 1,208 మంది, పోస్ట్‌మెట్రిక్ గృహాల్లో ఒక్కో హాస్టల్‌లో 120–150 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. పోస్ట్‌మెట్రిక్ గృహాల్లో ఉంటూ కళాశాలల్లో చదివే విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో చేరిన తర్వాత ఆన్‌లైన్‌లో స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో మాన్యువల్ పద్ధతిలోనే భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.
బీసీ, ఎస్టీ వసతిగృహాల్లో సవాళ్లు..
జిల్లాలో 18 బీసీ వసతిగృహాల్లో 1,520 మ?ంది విద్యార్థులకు వసతి కల్పించారు. బీసీ గృహాల్లో ప్రవేశం పొందిన వెంటనే ఆన్‌లైన్‌లో పేరు నమోదవుతున్నప్పటికీ, హాజరు నమోదులో సమస్యలు తలెత్తుతున్నాయి. 16 ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో 2,600 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతేడాది ఎస్టీ పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్ ప్రారంభించినప్పటికీ, స్కాలర్‌షిప్ ప్రక్రియ ఆలస్యం కారణంగా ఈ విధానం సజావుగా అమలు కావడం లేదు. దీంతో అన్ని వసతిగృహాల్లో హాజరు నమోదు మాన్యువల్‌గానే కొనసాగుతోంది.
జిల్లాల వారీగా కళాశాలలు, విద్యార్థులు, అధ్యాపకుల వివరాలు..
జిల్లా కళాశాలలు విద్యార్థులు సిబ్బంది
(బోధన, బోధనేతర)
మంచిర్యాల 10 4,320 165
కుమురంభీం ఆసిఫాబాద్ 11 4360 231