
జ్వరమొచ్చింది
ఆసిఫాబాద్: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నా యి. వారం రోజులుగా జిల్లాలోని పలు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వైరల్ జ్వరాలతో పాటు టైఫాయిడ్, మలేరియా, డెంగీ కేసులు సైతం నమోదవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రతీరోజు 450 వరకు ఓపీ నమోదవుతుండగా వందకు పైగా ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు వాంకిడి, రెబ్బెన, తిర్యాణి మండలాలకు చెందిన రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని శనివారం‘సాక్షి’ విజిట్ చేయగా వార్డులు రోగులతో కిటకిటలాడుతూ కనిపించా యి. జిల్లా కేంద్రానికి చెందిన శంకరమ్మ, భూమ య్య, లింగమ్మ, రామయ్య, ఈదులవాడకు చెందిన మారయ్య, మొండక్క, రహపల్లికి చెందిన పెంటయ్యతో పాటు 255 మంది జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజు ల్లోనే జిల్లా ఆసుపత్రిలో 189 వైరల్ కేసులు, 9 టై ఫాయిడ్, ఒక మలేరియా, ఒక డెంగీ కేసు నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి.
ఆస్పత్రులకు రోగుల తాకిడి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో సాధారణ సమయంలో రోజుకు 300 వరకు ఓపీ నమోదవుతుండగా వారం రోజులుగా రోగుల తాకిడి పెరిగింది. దీంతో శనివారం ఔట్‌పేషెంట్ల సంఖ్య 426కు చే రుకుంది. గతంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి 50 పడకలు ఉండగా ప్రస్తుతం జిల్లా మెడికల్ కళాశాల పరిధిలోకి వెళ్లడంతో ఆ సంఖ్య 330కి చేరుకుంది. ఆస్పత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో పాటు పక్క వార్డును వృద్ధులకు కేటాయించగా, రెండోఫ్లోర్‌ను జనరల్ వార్డుకు మార్చారు. దీంతో గతం కంటే అధికంగా రోగులు చికిత్స పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలు వైరల్ జ్వరాలతో బాధపడుతూ ఆర్‌ఎంపీ వైద్యులవద్ద చికిత్స పొందుతున్నారు.
పేదలపై ఆర్థిక భారం
జ్వర తీవ్రతతో బాధపడతుఉన్న మరి కొంతమంది జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్, మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పరీక్షల పేరుతో వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ, టైఫాయిడ్, మలేరియా, ఇతర పరీక్షలతో పాటు బెడ్ చార్జీలు, మందుల బిల్లులు పేదలకు భారంగా మారడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు.
వైద్యులు అందుబాటులో ఉండాలి
జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు అందుబాటులో ఉండాలి. గ్రామాల్లో వైద్య సిబ్బంది శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన వారికి చికిత్స అందిస్తున్నాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సి న అవసరం లేదు.
– డాక్టర్ సీతారాం, డీఎంహెచ్‌వో, ఆసిఫాబాద్

జ్వరమొచ్చింది