
సంక్షేమ గురుకులానికి సెలవులు
● శిథిలావస్థకు సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ పాఠశాల భవనం
● విద్యార్థులకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం
సిర్పూర్(టి): నియోజకవర్గ కేంద్రం సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలకు మంగళవారం నుంచి నాలుగురోజులపాటు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల తరగతి గదులతోపాటు డార్మెంటరీ భవనం శిథిలావస్థ చేరి పెచ్చులూడుతుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. మంగళవారం సా యంత్రం నుంచి తల్లిదండ్రులు వచ్చి పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. దీనిపై ‘సాక్షి’ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. గురుకులం భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థుల సౌకర్యార్థం కొన్నిరోజులు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి సూచన మేరకు ఇతర భవనంలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కాగజ్‌నగర్‌కు తరలింపు..?
సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఇక్కడ 640 మంది విద్యార్థులకు ప్రస్తుతం 490 మంది చదువుకుంటున్నారు. నూతన భవన నిర్మాణాలకు రూ.6.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయినా ఇప్పటివరకు టెండర్లు పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. ప్రస్తుతం భవనాలు శిథిలావస్థకు చేరి సెలవులు ప్రకటించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గురుకులాన్ని కాగజ్‌నగర్ పట్టణానికి తరలిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిర్పూర్(టి)కి మంజూరైన ఏకలవ్య గురుకులాన్ని ఇదే విధంగా కాగజ్‌నగర్‌లో నిర్వహిస్తున్నారు. నూతన భవనాలు నిర్మించి గురుకులాన్ని నియోజకవర్గ కేంద్రంలో కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.