
మనుగడ పోరాటం..!
● ఆవాసం కోసం పులులు.. అస్తిత్వం కోసం ఆదివాసీలు ● పులుల సంరక్షణ చర్యలపై తీవ్ర వ్యతిరేకత ● కవ్వాల్‌లో జాతీయ జంతువుకు తిప్పలు ● నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణ చర్యలు.. ఆదివాసీల మనుగడ మధ్య సంఘర్షణ నెలకొంది. పులులతో జీవవైవిధ్యం కోసం అటవీశాఖ చర్యలు చేపడుతుండగా, స్థానిక గిరిజన సముదాయాలు అటవీశాఖ ఆంక్షలను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పులులను సంరక్షించి జీవ వైవిధ్యం సాధించడం అటవీశాఖకు సవాల్‌గా మారింది. ఏటా జూలై 29న నిర్వహించే అంతర్జాతీయ పులుల దినోత్సవం రోజున పులుల రక్షణ, అవగాహన పెంపొందించడంపై దృష్టి సారిస్తోంది. ఈసారి కవ్వాల్ రిజర్వ్‌లో పులుల సంచారం, మానవ–వన్యప్రాణి ఘర్షణలు, గిరిజనుల ఆందోళనలు అటవీ శాఖకు సవాళ్లుగా మారాయి.
మహారాష్ట్ర నుంచి పులుల వలస
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా–అంధారీ అభయారణ్యాల నుంచి పెన్‌గంగా, ప్రాణహిత నదులు దాటి పులులు కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోకి వలస వస్తున్నాయి. గడిచిన దశాబ్దంలో కాగజ్‌నగర్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పులుల సంచారం పెరిగింది. 2012లో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించిన కవ్వాల్‌లో 892.23 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియా, 1123.21 చదరపు కిలోమీటర్లు బఫర్ ఏరియా ఉన్నప్పటికీ పులి స్థిర ఆవాసం ఏర్పర్చుకోవడం లేదు. దీంతో ఇక్కడి పరిస్థితులు అనుకూలించక తిరిగి వెళ్లిపోతున్నాయి. కొన్ని వేటగాళ్లకు చిక్కి మృత్యువాతపడుతున్నాయి.
జీవో 49 దుమారం..
మే 30న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 49 ఉమ్మడి జిల్లాలో దుమారం రేపింది. ఈ జీవో ప్రకారం.. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను తడోబా–అంధారీతో కలిపే ప్రాంతాన్ని కుమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్‌గా గుర్తించింది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో 339 గ్రామాలపై ఆంక్షలు విధించడంతో గిరిజన సంఘాలు నిరసనలు చేపట్టాయి. తుడుందెబ్బ సంఘం నాయకత్వంలో ఆదిలాబా ద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యా ల జిల్లాల్లో బంద్ నిర్వహించారు. ప్రభుత్వం జీవో ను తాత్కాలికంగా నిలిపివేసింది. గిరిజనులు తమ జీవనోపాధి కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
‘వాటి మనుగడ మన చేతుల్లోనే..
పులుల కోసం గర్జించు..
పులులు, అడవులు, ప్రాణాలను రక్షించు’
ఈ ఏడాది అంతర్జాతీయ పులుల దినోత్సవ ఇతివృత్తమిది.
మానవ–వన్యప్రాణి సంఘర్షణ..
కవ్వాల్ రిజర్వ్‌లో మానవ–వన్యప్రాణి సంఘర్షణ తీవ్ర సమస్యగా ఉంది. నాలుగేళ్లలో పులుల దాడుల్లో నలుగురు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. వందలాది పశువులు పులుల దాడితో చనిపోయాయి. పశువుల యజమానులకు పరిహారం అందినప్పటికీ, స్థానికుల్లో వ్యతిరేకత కొనసాగుతోంది. పులులు కూడా వేట, ఉచ్చులు, మానవ కార్యకలాపాలతో ముప్పు ఎదుర్కొంటున్నాయి. పోడు భూములు, సింగరేణి గనులు, సాగునీటి ప్రాజెక్టుల వద్ద పులుల సంచారం ఘర్షణలను పెంచుతోంది. చివరగా మహారాష్ట్ర నుంచి పులులను ఇక్కడికి తీసుకొచ్చే ప్రతిపాదనలు చేసున్నా, స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య ఘర్షణ తగ్గించేలా చర్యలు తీసుకుంటేనే ఇరువర్గాలకు ఊరట కలుగుతుంది.

మనుగడ పోరాటం..!