
మెమో ఇచ్చినా.. అదే తీరు!
● కాగజ్‌నగర్ సబ్ డివిజన్‌లో చర్చనీయాంశంగా ఓ పోలీసు అధికారి వ్యవహారం ● ఇసుక, పశువుల వ్యాపారులతో మాటామంతి ● ‘సాక్షి’ కథనాలపై చర్చ
సాక్షి, ఆసిఫాబాద్: శాంతి భద్రతలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వాలి. ఇసుక, జూదం, పశువుల అ క్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి. కానీ కాగజ్‌నగర్ పో లీస్ సబ్‌డివిజన్‌లో పనిచేస్తున్న సదరు అధికారి మాత్రం అందుకు భిన్నంగా అక్రమార్కులతో చే తులు కలపడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆ అధికారికి జిల్లా ఎస్పీ వార్నింగ్ మెమో జారీ చేసినా అతని పనితీరులో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.
యథేచ్ఛగా అక్రమాలు
కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని ఓ కీలక పోలీసు స్టేషన్‌కు ఆయన బాస్. ఆ స్టేషన్ పరిధిలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఇసుక దందా.. జూదం సరేసరి. క్వారీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కంకర తరలించే లారీల సంగతి చెప్పనక్కరలేదు. ఆయన సర్కిల్ స్టేషన్ బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకు ఆదాయ మార్గాలను బాగా అన్వేషించి.. వ్యాపారులపై దాడులు చేసి హడావుడి చేశారు. ఆ తర్వాత అక్రమార్కులు ఎవరెవరు ఎంత ముట్టజెప్పాలన్న విషయంలో వారి మధ్య ఓ ఒప్పందం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఒప్పందంలో భాగంగానే పశువులను అక్రమంగా తరలించే వ్యక్తులు, ఇసుక రవాణాదారులు ఆ పోలీసు అధికారికి ప్రతినెలా రూ.15 లక్షల వరకు మామూళ్లు అందిస్తున్నట్లు తెలుస్తోంది. కంకర వ్యాపారుల నుంచి ఆ అధికారికి నెల మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడైనా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే నలుగురు, ఐదుగురిపై కేసులు నమోదు చేసి మమా అనిపించేస్తున్నారని అక్కడ పనిచేసే పోలీసువర్గాలు బాహాటంగానే చర్చించుకోవడం గమనార్హం.
‘సాక్షి’ కథనాలపై చర్చ
ఈ నెల 16న ‘సాక్షి’లో ‘ఖాకీకి అవినీతి మరక’ అనే శీర్షిక పేరిట ఒక కథనం ప్రచురితమైంది. దీనిపై పోలీసు జిల్లా బాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే రోజు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న సదరు పోలీసు అధికారి ట్రాక్టర్ యజమానులు, పశువుల అక్రమ రవాణా వ్యాపారులతో మాట్లాడారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని సెల్‌ఫోన్‌లో చూపి ‘మాది ఫ్రెండ్లీ పోలీసింగే.. కానీ ‘సాక్షి’లో కథనం వచ్చింది. కాబట్టి పై అధికారులకు మేము సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఇసుక, పశువుల అక్రమ రవాణాపై దాడులు చేస్తున్నాం.’ అని స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే ఇటీవల పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయాలని కోరుతూ బుధవారం కొందరు ట్రాక్టర్ యజమానులు అటు తహసీల్దార్‌ను, ఇటు పోలీసు అధికారులను కలిసి వేడుకోగా.. ఇదిగో ఈ రోజు కూడా ‘సాక్షి’లో ‘ఇసుక దందా’ పేరిట కథనం వచ్చింది. మీ ట్రాక్టర్లను వదలడం కుదరదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
వార్నింగ్ మెమో..
పశువుల అక్రమ రవాణా కట్టడిలో అక్రమార్కులకు అండగా ఉంటున్నారనే నివేదికల నేపథ్యంలో కాగజ్‌నగర్ డివిజన్‌లో పనిచేస్తున్న ఆ పోలీసు అధికారికి జిల్లా ఎస్పీ వార్నింగ్ మెమో ఇచ్చారు. మరోమారు ఇది పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినా అధికారి తీరులో మార్పు రాలేదని నిఘా వర్గాలు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే నివేదికలు ఉన్నతాధికారులకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ డివిజన్‌లో పనిచేస్తున్న మరికొంత మంది అధికారులపై త్వరలోనే చర్యలు ఉండనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.