
ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. రెబ్బెన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం తరలింపులో ఏమైనా జాప్యం జరుగుతుందా.. కొనుగోళ్ల ప్రక్రియ సక్రమంగా సాగుతుందా.. తదితర వివరాలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ 17శాతం కంటే తక్కువ తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. రోజుల తరబడి కేంద్రాల్లో నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలన్నారు. అకాల వర్షాలతో కేంద్రాల్లో వడ్లు తడిసిపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, కొనుగోళ్ల ప్రక్రియ, ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని సూచించారు. లారీలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఆర్‌ఐలు ఉదయ్‌కుమార్, సౌమ్య, ఏవో దిలీప్‌కుమార్, ఏఈవో రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.