
రాత్రుల్లో ఇష్టారీతిన..
● యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా ● మహారాష్ట్ర నుంచి జిల్లాకు.. ● రాత్రిపూట నగరాలకు తరలింపు ● ఇరుకు వాహనాల్లో మూగజీవాల వేదన
నది మీదుగా తరలింపు
తాటిపల్లి సమీపంలోని వార్దా నది మీదుగా మహారాష్ట్ర నుంచి వందల పశువులను కౌటాలకు తరలిస్తున్నారు. శుక్ర, శని, ఆది, సోమవారాలు నాలుగు రోజులపాటు నది వద్ద పశువుల అక్రమ రవాణా సాగుతోంది. నదిలో నీరు ప్రవహిస్తున్నా ప్రమాదకరంగా మూగజీవాలను తరలిస్తున్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.
– దత్తు, తాటిపల్లి, మం.కౌటాల
కౌటాల(సిర్పూర్): జిల్లాలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సరిహద్దు నుంచి నది దాటించి గుట్టుగా వేలాది ఎద్దులు, ఆవులను పట్టణాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. మూగజీవాల రోదనను ఆలకించేవారు కరువయ్యారు. సంతల నుంచి డీసీఎంలు, కంటైనర్లు, బొలేరో వాహనాల్లో కుక్కి నగరాల్లోని వ్యాపారు లకు అమ్ముతున్నారు. వాహనాల్లో సరిపడా స్థలం లేక పశువుల కాళ్లు, శరీర భాగాలు విడిపోయి అల్లాడిపోతున్నాయి. మేత, నీరు లేకపోవడం ఊపిరాడ క మార్గమధ్యలోనే ప్రాణాలు విడుస్తున్నాయి. మృతి చెందిన పశువులను అటవీ ప్రాంతాలు, రోడ్డు పక్కన పడేసి వెళ్తుండటంతో కళేబరాల దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
సంతల నుంచే..
జిల్లాలో ఎద్దులు, ఆవులు కలిపి 2,93,895 వరకు ఉండగా, గేదెలు 49,445 ఉన్నాయి. ఇందులో ఏటా పదిశాతం వరకు వట్టిపోతాయి. మరికొన్ని అనారోగ్యం పాలవుతాయి. వీటిని కొందరు వ్యాపారులు రాజకీయ అండతో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కౌటాల, జైనూర్, వాంకిడి ప్రాంతాల్లో వారానికి ఒకసారి జరిగే సంతల ముసుగులోనే కొందరు వ్యవహారం నడిపిస్తున్నారు. పశువుల అక్రమ రవాణాకు ముఠాగా ఏర్పడి వారసంతలో పశువులను తక్కువ రేటుకు కొని వాహనాల్లో ఎక్కించి హైదరాబాద్, కరీంనగర్‌కు తరలిస్తున్నారు. అలాగే సరిహద్దులోని మహారాష్ట్ర నుంచి పశువులను సంతకు తీసుకువచ్చి ఒక్కో వాహనంలో పదుల సంఖ్య వరకు అడ్డదిడ్డంగా ఎక్కిస్తున్నారు. పశువుల రవాణా కోసం అనుమతులు ఇవ్వాలని ఇటీవల కౌటాల పశువైద్యాధికారి అనుమతి కోసం భారీగా ప్రజలు రావడంతో పోలీసులతో వారిని నిలువరించాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్‌లో నిర్వహించే పండుగల కోసం ఇప్పటినుంచే పశువులను తరలిస్తున్నారు. 1960 జంతు పరిరక్షణ చట్టం ప్రకారం పశువులను వధించడం నేరం. వట్టిపోయిన పశువులను రైతుల నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు దళారులు కొంటున్నారు. వారు మాత్రం రూ.15 వేల నుంచి రూ.20 వేలకు అమ్ముకుంటున్నారు. మాంసంతోపాటు చర్మం, కొమ్ములు, ఎముకలు ఇతర భాగాలు చెప్పులు, వాయిద్య పరికరాలు, ఎరువుల తయారీలో వినియోగిస్తారు. భారీగా విక్రయాలు జరుగుతున్నా మార్కెటింగ్ శాఖ, రవాణా చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
చెక్‌పోస్టుల ఏర్పాటు
పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్‌శాఖ చర్యలు చేపట్టింది. ఆరు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. సిర్పూర్(టి) మండలం పెద్దబండ వద్ద, చింతలమానెపల్లి మండలం ఆడేపల్లి ఎక్స్‌రోడ్డు, బెజ్జూర్ మండలం సలుగుపల్లి ఎక్స్‌రోడ్డు, కాగజ్‌నగర్ మండలం వంజరీ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే జైనూర్ మండలం రాణి రుద్రమదేవి చౌక్, వాంకిడి టోల్‌ప్లాజా వద్ద చెక్‌పోస్టులు ఉన్నాయి. పశువుల అక్రమ రవాణాను ఆరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.
వాంకిడి, కౌటాల, జైనూర్ మండలాల్లోని పశువుల సంతల్లో దళారులు పశువులను కొనుగోలు చేసి రాత్రి వేళ్లల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. సిర్పూర్(టి) నుంచి కాగజ్‌నగర్ వరకు, రెబ్బెన నుంచి మంచిర్యాల జిల్లా దాటే వరకు ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. కొంతమంది రాత్రి వేళల్లో రహదారులపై తిరిగే పశువులు, ఒంటరిగా ఉండేవాటిని, రైతులు ఇంటి సమీపంలో కట్టి ఉంచిన వాటిని లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ దందాలో వాటాలు అందరికీ అందుతుండటంతో చీకటి వ్యాపారం గప్‌చుప్‌గా సాగుతోంది. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.