● కాగజ్‌నగర్‌లో రూ.లక్షలు కాజేత ● లబోదిబోమంటున్న బాధిత మహిళలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహిళలకు సులువుగా రుణాలు ఇస్తామని చెప్పి రూ.లక్షలు వసూళ్లు చేసి మోసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ నెల 7న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ముగ్గురు వ్యక్తులు తాము ఆంధ్రా నుంచి వచ్చామని చెప్పుకుంటూ కాలనీల్లో ఇంటింటికీ తిరిగారు. మహిళలకే రుణాలు అంటూ, ఒక్కొక్కరికి కనీసం రూ.50వేల చొప్పున రుణాలు ఇస్తామని నమ్మించారు. ముందుగా మహిళలు గ్రూప్‌గా ఏర్పాటు చేసుకోవాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.3వేల చొప్పున వసూలు చేశారు. అలా పట్టణంలోని విజయ్ బస్తీ, కోసిని, సర్దార్‌బస్తీ, తదితర కాలనీలకు చెందిన మహిళలు, అంగన్‌వాడీ టీచర్లు, గృహిణులు మొత్తం వందమందికి పైగా డబ్బులు కట్టారు. అయితే ఈ నెల 11న డబ్బులు చెల్లించిన వారందరికీ రుణాలు ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. కానీ గత రెండు రోజులుగా రుణాల కోసం మహిళలు కాల్స్ చేస్తే అటు నుంచి ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. డబ్బులు కట్టిన మహిళలకు రూ.3వేలు తీసుకుని రూ.వెయ్యి విలువైన టేబుల్ ఫ్యాన్లు అంటగట్టారని వాపోతున్నారు. ఆసిఫాబాద్ పట్టణం జూబ్లీ మార్కెట్‌లో తమ ఆఫీసు ఉందని చెబితే అక్కడికి వెళ్లి చూస్తే ఎలాంటి ఆఫీసు లేదు. ఈ వ్యవహారమంతా చూస్తే మోసపోయినట్లుగా గుర్తించారు. ఇంకా కొత్తగా ఎవరూ కూడా డబ్బులు కట్టడం చేయొద్దని బుధవారం సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇదంతా చెప్పుకుంటే ఇబ్బందిగా ఉంటుందని ఎవరూ కూడా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వలేదు. మారుమూల ప్రాంతాల్లో ఇంకా బాధితులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే రుణాల మోసంపై అందరం కలిసి ఫిర్యాదు చేస్తామని బాధిత మహిళ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.